● విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్
అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ లో ఓల్టేజీ ఉన్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. సోమవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో వినియోగదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ప్రతి మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ద్వారా జనబాట కార్యక్రమం చేపట్టి విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలపై ఫిర్యాదు చేసిన వెంటనే నాలుగు రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవి ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా లో ఓల్టేజీ సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలను ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. లో ఓల్టేజీ సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఇళ్ల నిర్మాణ లక్ష్యం
పూర్తి చేయాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం అర్బన్: ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని ఉగాదిలోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. వివిధ అంశాలపై జేసీ సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల, ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.ఓ కింద 2,514 ఇళ్లు మంజూరైతే 1,249 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. మిగిలిన వాటిని గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు సమష్టిగా పని చేసి ఉగాది నాటికి జిల్లాలో 16,702 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఎన్‌ఆర్‌జీఎస్ పనుల కింద మెటీరియల్ ఖర్చుకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్ చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, హౌసింగ్ పీడీ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


