కళ్యాణదుర్గం రూరల్: మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. స్థానిక కార్యాలయంలో సోమవారం సీఐ నీలకంఠతో కలసి వివరాలను ఆయన వెల్లడించారు. బ్రహ్మసముద్రం మండలం నంజాపురం గ్రామానికి చెందిన చెందిన తులసి గత నెల 19న కళ్యాణదుర్గం నుంచి తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వెంబడించిన వ్యక్తి నిర్జన ప్రదేశంలో తులసి వెళుతున్న స్కూటీని ఢీకొని ఆమెను కిందపడేలా చేశాడు. అనంతరం బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన బ్రహ్మసముద్రం పోలీసులు పక్కా ఆధారాలతో సోమవారం అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి గ్రామానికి చెందిన బండి సుబ్రహ్మణ్యంను కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామం వద్ద అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. అతని నుంచి 15 గ్రాముల బరువున్న బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు కొంత కాలంగా కంబదూరులోని గుద్దెళ్ల గ్రామంలో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు.
హాల్ టికెట్‌లో ఫొటో మిస్ మ్యాచ్
● పరీక్ష కేంద్రం నుంచి విద్యార్థిని బయటకు పంపిన అధికారులు
తాడిపత్రి టౌన్: హాల్ టికెట్‌లో ఫొటో మిస్ మ్యాచ్ అంటూ ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రం నుంచి అధికారులు బయటకు పంపేశారు. దీంతో ఏడుస్తూ ఆ విద్యార్థి ఇంటి బాట పట్టాడు. వివరాల్లోకి వెళితే... తాడిపత్రి మండలం బందర్లపల్లెకు చెందిన డేరంగుల వెంకటవంశీధర్ దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం నాడు పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ తీసుకుని తనకు కేటాయించిన తాడిపత్రిలోని ప్రకాశం మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నాడు. మరికాసేపట్లో ప్రశ్న పత్రం ఇస్తారనగా... హాల్ టికెట్‌ను పరిశీలించిన అధికారులు అందులో సదరు విద్యార్థి ఫొటో కాకుండా గుర్తు తెలియని వ్యక్తి ఫొటో ఉండడం గమనించి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్థి కన్నీటి పర్యంతమయ్యాడు. ఓపెన్ కళాశాల నిర్వాహకుల తప్పిదానికి తాను బలైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.


