కళ్యాణదుర్గం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోగ్యం విషమించింది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటుండగా సోమవారం ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ద్విచక్ర వాహనాలు
ఢీ – ఒకరి మృతి
లింగాల: లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో యల్లనూరు మండలం గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అప్పల గంగాధర్ (35) మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దకుడాల గంగమ్మదేవత తిరునాలకు వెళ్లి అక్కడ నుంచి పులివెందులకు వెళుతుండగా ఇప్పట్ల గ్రామ సమీపంలో పులివెందులకు చెందిన శ్రీహరి, విశ్వరూప్ అనే యువకులు పెద్దకుడాలకు వస్తుండగా ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన గంగాధర్‌ను వెంటనే పులివెందుల సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయం
● వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ
విడపనకల్లు: ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 9న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల పక్షం సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాలుగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధర్నాకు ఉరవకొండ నియోజకవర్గంలోని ఆర్డీటీ లబ్ధిదారులు తరలి రావాలని పిలుపునిచ్చారు.


