వన్యప్రాణులు విలవిల | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులు విలవిల

Feb 24 2026 7:11 AM | Updated on Feb 24 2026 7:11 AM

వన్యప

వన్యప్రాణులు విలవిల

రాయదుర్గం: వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి ప్రతాపం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోనూ అప్పుడే దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే కొండకోనల్లో ఉండే వన్యప్రాణుల పరిస్థితి ఏమిటో ఓసారి ఆలోచిస్తే అయ్యో.. అనక తప్పదు. జిల్లా అటవీ పరిధిలో చుక్కనీరు లభించక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. దప్పిక తీర్చుకునేందుకు మైదాన, జనవాసాల్లోకి వచ్చి ప్రమాదాలు, వేటగాళ్లు, కుక్కల ఉచ్చుకుచిక్కి బలైపోతున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం రాయదుర్గం కొండలో గొంతు తడుపుకునేందుకు వచ్చిన చిరుత బురదలో ఇరుక్కుని మృతి చెందింది. గతేడాది కళ్యాణదుర్గం ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని శెట్టూరు, కుందుర్పి ప్రాంతాల్లోనూ రెండు చిరుతలు ఇలాగే మృత్యువాత పడ్డాయి. వన్యప్రాణి సంరక్షణపై చంద్రబాబు సర్కార్‌ ఉదాసీనత కనబరుస్తుండడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతోంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, కణేకల్లు, వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి, కూడేరు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ఎలుగుబంట్లు, చిరుతలు, తాడిపత్రి, యాడికి, యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో జింకలు, దుప్పిలు, కుందేళ్లు ఇతర వన్యప్రాణులు దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన నీటి వసతిని ప్రభుత్వం కల్పించకపోవడంతోనే సమీప పొలాల్లో దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు వస్తుంటాయని రైతులు అంటున్నారు.

ఏం చేయాలంటే ..

జిల్లాలోని మూడు ఫారెస్ట్‌ రేంజ్‌లు ఉన్నాయి. మొత్తం 74,400 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వేలాది వన్యప్రాణులు వీటి మధ్య ఆశ్రయం పొందుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం సరైన నిధులు సమకూర్చకపోవడంతో దప్పిక తీర్చలేని దుస్థితి దాపురించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రేంజ్‌ల పరిధిలోనూ సుమారు వంద నీటి తొట్టెలు నిర్మించారు. రూ.లక్షలు ఖర్చుచేసి సాసర్‌ పిట్స్‌ తవ్వించారు. చెక్‌డ్యాంలు, పర్కులేషన్‌ ట్యాంకులు, నీటి కుంటల్ని నిర్మించి సీజన్‌తో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా నీరందించేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ఆ విధానం కనిపించడం లేదు. వన్యప్రాణుల తాగునీటి కోసం అడవుల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు, సాసర్‌ రింగ్స్‌, సాసర్‌పిట్స్‌, ఇతర నీటి వనరులన్నీ ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. కనీసం ట్యాంకర్లతో నీరందిస్తే కొంతవరకై నా ఉపశమనం కల్పించవచ్చు.

కార్చిచ్చుతో ఇబ్బంది

అడవులకు కార్చిచ్చు సమస్య వేధిస్తోంది. నిప్పు.. అడవులకు ముప్పుగా మారుతోంది. కొందరు అవగాహన లోపంతో పచ్చదనాన్ని బుగ్గిపాల్చేస్తున్నారు. ఈ కారణంగా వన్యప్రాణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల రాయదుర్గం మండలం ధర్మపురి, కుందుర్పి మండలం జంబుగుంపల అడవీప్రాంతాల్లో నిప్పు రాజుకుంది. అధికారులు మేల్కోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. వేసవి ముగిసేదాకా అడవులు, వన్యప్రాణులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలందరిపైనా ఉంది.

మానిరేవు బీట్‌లో నీరు లేక ఎండిపోయిన నీటితొట్టె

రాయదుర్గం కొండలో నీటి కోసం వచ్చి బురదలో ఇరుక్కుని మృతి చెందిన చిరుత (ఫైల్‌)

వన్యప్రాణుల రక్షణకు చర్యలు

అడవుల్లో వన్యప్రాణుల రక్షణకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నాం. ఎండలు పెరుగుతుండడంతో దాహార్తి తీర్చేందుకు ఇప్పటికే సాసర్‌పిట్స్‌ ఏర్పాటుకు అనుమతులిచ్చాం. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. అందుబాటులో ఉన్న నిధులతోనే తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తాం. అగ్నిప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. వేసవి పూర్తయ్యే వరకు ప్రజలంతా సహకరించాలి. అడవుల్లోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – చక్రపాణి,

డీఎఫ్‌ఓ, అనంతపురం

అడవులను వీడి .. జనావాసాల్లోకి

ప్రమాదాలబారిన పడి మృత్యువాత

ఎండలు ముదురుతున్నా ప్రత్యామ్నాయం చేపట్టని ప్రభుత్వం

నిధులు మంజూరు చేయకపోవడంతోనే ఇబ్బంది

వన్యప్రాణులు విలవిల1
1/1

వన్యప్రాణులు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement