మామిడిపై నల్లతామర దాడి | - | Sakshi
Sakshi News home page

మామిడిపై నల్లతామర దాడి

Feb 24 2026 7:10 AM | Updated on Feb 24 2026 7:10 AM

మామిడిపై నల్లతామర దాడి

మామిడిపై నల్లతామర దాడి

మిరప రైతులను నిండా ముంచిన నల్ల తామర పురుగు ఇప్పుడు క్రమంగా మామిడి తోటలపై దాడి చేస్తోంది. పూత నల్లగా మారి తెట్టెలు.. తెట్టెలుగా రాలిపోతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రూ.వేలల్లో ఖర్చు పెట్టి పురుగు నివారణ మందులు పిచికారీ చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాభాల మాట అటుంచి అప్పులు, వడ్డీలు తీర్చే మార్గం కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84 వేల ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఇందులో అనంతపురం జిల్లాలో 35 వేల ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 49 వేల ఎకరాల్లో మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో పూత విరగ పూయడంతో దిగుబడిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ లెక్కన అనంతపురం జిల్లాలో 1.05 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిపై రూ.525 కోట్ల టర్నోవర్‌ను అధికారులు అంచనా వేయగా... శ్రీసత్యసాయి జిల్లాలోనూ 1.47 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిపై రూ.735 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేశారు.

విజృంభిస్తున్న నల్ల తామర

కొన్నేళ్లుగా మిరపను చిదిమేసిన ఇండోనేషియాకు చెందిన నల్లతామర పురుగు ప్రస్తుతం మామిడిని ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తోంది. పూత, పిందెను తామర పురుగులు దారుణంగా దెబ్బతీస్తున్నాయి. విచక్షణా రహితంగా మందుల వాడకం కారణంగా పురుగు ఉధృతి మరింత పెరిగింది. ఇక ఏ మాత్రం అలసత్వం వహించినా దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ డి.శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నారు. అలాగే మామిడిలో ప్రధాన సమస్యగా ఉన్న తేనె మంచు పురుగుల ఉధృతి సైతం ఇన్నాళ్లూ వాడుతున్న పురుగు మందులకు ఏ మాత్రం తగ్గే పరిస్థితి లేనందున... అందుబాటులోకి వచ్చిన కొత్తరకం పురుగు మందులు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.

నల్లతామర నివారణ చర్యలు ఇలా..

సస్యరక్షణలో భాగంగా జీవనియంత్రణ పద్ధతులు పాటించడం ద్వారా నల్లతామరను సమర్థవంతంగా నివారించుకోవచ్చని డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి సూచిస్తున్నారు. ముందుగా మామిడి తోటలు, పొలం గట్ల మీద కలుపు లేకుండా చేసుకోవాలి. కాపునకు వచ్చిన ఒక్కో మామిడి చెట్టు పాదులో 2.5 కిలోల నుంచి 3 కిలోల వేపపిండి చల్లుకోవాలి. ఎకరాకు 35 నుంచి 50 వరకు నీలిరంగు కలిగిన జిగురు అట్టలు చెట్టు మార్చి చెట్టు కొమ్మలకు కట్టి నాలుగైదు రోజుల తర్వాత పరిశీలించాలి. నల్లతామర పురుగులు కనిపిస్తే లీటర్‌ నీటికి 5 మి.లీ వేపనూనె లేదా 1 మి.లీ ఆజాడిరక్టిన్‌ (10 వేల పీపీఎం) కలిపి పిచికారీ చేయాలి. ఇందులో 7.5 గ్రాములు వేపసబ్బు (నీమ్‌ సోప్‌) లేదా 7.5 గ్రాములు కానుగసబ్బు (పొంగేమియా సోప్‌) కలుపుకోవడం మరవరాదు. పూత మీద నల్లతామర కనిపిస్తే జీవశిలీంద్రాలైన 5 గ్రాముల బవేరియా బాసియానా లేదా 5 గ్రాములు శీలియం లెకానీ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడి పిందె జొన్న గింజ నుంచి బఠానీ సైజులో ఉన్నపుడు పురుగు ఉధృతి అధికంగా ఉంటే లీటర్‌ నీటికి 2 మి.లీ డైమిథోయేట్‌ (30 ఈసీ) లేదా 1.5 గ్రాములు అసిఫేట్‌ (75 ఎస్‌పీ) లేదా 0.3 గ్రాములు థయోమిథాక్సామ్‌ (25 డబ్ల్యూజీ) లేదా 1 మి.లీ పిప్రొనిల్‌ (5 ఎస్‌పీ) లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్‌ (45 ఎస్‌పీ) కలిపి పిచికారీ చేస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి.

తేనెమంచు పురుగు

చిన్నా పెద్దా తేడా లేకుండా తేనె మంచు పురుగులు మామిడి పూత కాడ, పూమొగ్గను ఆశించి రసం పీలుస్తుంటాయి. దీంతో పూత, పిందె రాలిపోతాయి. ఈ పురుగు శరీరం నుంచి తేనె లాంటి పదార్థం విసర్జిస్తుంటాయి. దీంతో కాపనోడియం అనే శిలీంద్రం పెరిగి కాయలపై మసి మంగు ఏర్పడుతుంది. ఈ పురుగు ఆశిస్తే కనిష్టంగా 20 శాతం, గరిష్టంగా 100 శాతం నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే లేత ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకుని, కొన్ని సందర్భాల్లో ఆకు చివరి భాగం కాలిపోయినట్లు కనిపిస్తుంది.

నివారణకు కొత్త మందులు

కొమ్మల కత్తిరింపు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మొదట్లోనే ఈ పురుగును నియంత్రించవచ్చు.

తేనె మంచు పురుగు నివారణకు గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఇమిడాక్లోప్రిడ్‌, తెమతోక్సామ్‌, లాబ్డా సైహలోత్రీన్‌ లాంటి మందులు పిచికారీ చేస్తూ వస్తున్నారు. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకున్న కారణంగా ఈ మందులు ద్వారా ప్రస్తుతం ఆశించిన మేర ఫలితాలు ఉండడం లేదు.

ఇంత కాలం తేనె మంచు పురుగు నివారణకు వినియోగిస్తున్న మందులు పక్కన పెట్టి.. కొత్తగా 1.5 మి.లీ బుఫ్రోఫేజిన్‌ లేదా 1 గ్రాము బుప్రోఫేజిన్‌ 20శాతం + అసిఫేట్‌ 50 శాతం డబ్ల్యుపీ లేదంటే 0.6 గ్రాముల ఫైమెట్రౌజైన్‌ 50 శాతం డబ్ల్యుజీ లేదంటే 0.2 గ్రాముల డైనైటోఫూరాన్‌ 20 శాతం ఎస్‌జీ లేదంటే 2 మి.లీ బెంజ్‌ ఫైరిమోక్సన్‌ 10 ఎస్‌సీ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

లేదంటే ఎకరాకు 94 మి.లీ ట్రిఫ్లూమోజోప్రిమ్‌ మందు పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బట్టి మందులు మార్చి మార్చి రెండు మూడు సార్లు పిచికారీ చేసుకుంటే ఆశించిన మేర ఫలితాలు ఉంటాయి.

ఇంత కాలం మిరపను దెబ్బతీసిన తామర పురుగులు

నల్ల తామరకు తోడు తేనె మంచు పురుగు ఉధృతి

సస్య రక్షణ చర్యలతోనే నివారణ సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement