ఉపాధి హామీ.. ఇక వీబీ జీ రామ్ జీ
అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఇక వీబీ జీ రామ్ జీ పథకంగా (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్) మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే 2026–27ఆర్థిక సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా నూతన ఉపాధిహామీ చట్టం అమల్లోకి రానుంది.
ఏడాదికి 125రోజులు పనిదినాలు
వీబీ జీ రామ్ జీ పథకం కింద కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కేటాంచారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. రోజు వారీగా రూ.311 మేర వేతనం సైతం అందించనున్నారు. గతంలో పని అడిగితే ఇచ్చే విధానం ఉండేది. ప్రస్తుత నూతన చట్టంలో గ్రామ పంచాయతీలలో కూలీలను బట్టి బడ్జెట్ కేటాంచనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులను చేశారు.
పనికి హాజరైతేనే వేతనాలు
వీబీ జీ రామ్ జీ చట్టంలో సమూల మార్పులు చేపట్టారు. నూతన సాంకేతిక విధానాంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఇందు కోసం కూలీల బయోమెట్రిక్ జియో ట్యాగింగ్, రియల్ టైం డ్యాష్ బోర్డులతో సాంకేతికతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్టర్లకు కాలం చెల్లినట్టే. పని చేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. అక్కడికి వెల్లి కూలీలు బయో మెట్రిక్ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతో పాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరో మారు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేసింది.
10 రోజుల్లో వేతనాల చెల్లింపులు
వీబీ జీ రామ్ జీ చట్టంలో పనులకు హాజరైన కూలీలకు 10 రోజుల్లో వేతనాలు ఖాతాలకు చెల్లిస్తారు. పనులకు హాజరైన వెంటనే వారి వివరాలు వీబీ జీ రామ్ జీ నూతన యాప్‌లో నమోదు అవుతాయి. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌లను కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేర నిధులను కేటాయించే విధంగా చట్టంలో మార్పులను చేశారు. రాష్ట్రం వాటా చెల్లిస్తేనే కేంద్రం వాటా నిధులను విడుదల చేస్తారు.
మౌలిక వసతులపై ఫిర్యాదులకు అవకాశం
ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతంలో కూలీలకు కనీస మౌలిక వసతులు లేకుంటే నేరుగా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. పనుల వద్ద తాగునీరు, పనిముట్లు, మెడికల్ కిట్లు 100 శాతం ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ఇవి లేకుంటే కూలీలే నేరుగా టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వ్యవసాయ పనుల ఉండే సీజన్‌లో 60 రోజుల పాటు పనులకు విరామం ప్రకటించే విధంగా చట్టాన్ని రూపొందించారు.
కేంద్రం వాటా 60,
రాష్ట్రం 40 శాతం నిధులు
ఉపాధి హామీ.. ఇక వీబీ జీ రామ్ జీ


