సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం
అనంతపురం అర్బన్: సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేయాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ ఆక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో 1,25,578 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ధడం లక్ష్యంగా నిర్దేశించామన్నారు. వార్డుస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అక్షర కేంద్రాలను అధికారులు సందర్శించి హాజరు శాతం పెంచి కార్యక్రమాన్ని సజావుగా నడిపించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన రహర్, డీఆర్‌ఓ మలోల, ఎఫ్‌ఎస్‌ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, వయోజన విద్య ఉప సంచాలకులు సంపంగి వెంకటేశ్వర్లు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీగా ఎం.శ్రీదేవి
● నాగమణి ప్రకాశం జిల్లాకు బదిలీ
అనంతపురం సెంట్రల్: మహిళా, శిశు సంక్షేమశాఖ– ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సీడీపీఓ ఎం.శ్రీదేవి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది అక్టోబర్‌లో శిశుగృహలో చోటు చేసుకున్న పసికందు మరణం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ విషయాన్ని కలెక్టర్ ఆనంద్ తీవ్రంగా పరిగణించారు. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం అప్పటి శిశుగృహ సిబ్బంది మొత్తాన్ని తొలగించారు. పర్యవేక్షణ లోపం కారణంగా అప్పటి పీడీ నాగమణిపై సస్పెన్షన్‌వేటు పడింది. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తి వేస్తూ ప్రకాశం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆమెకు పోస్టింగ్ కల్పించారు. శిశుగృహ ఘటన జరిగినప్పటి నుంచి సహకారశాఖ అధికారి అరుణకుమారి ఐసీడీఎస్ పీడీగా పనిచేస్తున్న విషయం విదితమే. తాజా బదిలీల్లో బద్వేలు సీడీపీఓ ఎం.శ్రీదేవికి అనంతపురం పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
బీఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ మూడో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ శారద, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం


