మనల్నెవడ్రా ఆపేది!
అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. గతంలో భారీగా జరిమానాలు విధించి సీజ్ చేసిన క్వారీల్లో సైతం తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే మమ్మల్ని ఎవడ్రా ఆపేది’ అన్న రీతిలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. విషయం గనులశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా క్వారీల వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిగో సాక్ష్యం..
శెట్టూరు మండలం యాటకల్లు గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన డి.శివప్రసాద్ 1.07 హెక్టార్లలో రోడ్డు మెటల్ క్వారీకి లీజు తీసుకున్నాడు. గనుల శాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా దాదాపు 6,700 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను అక్రమంగా తవ్వేశాడు. గనులశాఖ అధికారులు 2024 మేలో క్వారీని పరిశీలించి రూ.43 లక్షల మేర నిర్వాహకునికి జరిమానా నోటీసులు జారీ చేసి క్వారీని సీజ్ చేశారు. ప్రస్తుతం క్వారీ నిర్వాహకుడు కళ్యాణదుర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాడు. గనులశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదంటే ఏస్థాయిలో అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
చట్టరీత్యా నేరం
అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న క్వారీలకు జరిమానాలు విధించాం. వాటిని చెల్లించిన తర్వాతే మళ్లీ కార్యకలాపాలు చేపట్టాలి. పైసా చెల్లించకుండా తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరం. విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
– ఆదినారాయణ,
డిప్యూటీ డైరెక్టర్, గనులశాఖ
గతంలో సీజ్ చేసిన
క్వారీల్లో మళ్లీ తవ్వకాలు
జరిమానా వేసిన వాటిల్లోనూ దందా
శెట్టూరు మండలం యాటకల్లులో వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తరలింపు
అటు వైపు కన్నెత్తి చూడని అధికారులు
చియ్యేడు గ్రామ పొలం సర్వే నం. 231లో హెక్టార్ భూమిలో రోడ్డు మెటల్ క్వారీకి
ఎం. గాయత్రి పేరిట లీజు తీసుకున్నారు. రాయల్టీ చెల్లించకుండా భారీ ఎత్తున మెటల్‌ను తరలించడంతో గతంలో గనులశాఖ, విజిలెన్సు అధికారుల బృందం సంయుక్తంగా క్వారీని పరిశీలించింది. అక్రమాలకు
పాల్పడినట్లు నిర్ధారించి రూ. 76 లక్షల మేర
నిర్వాహకులకు జరిమానా విధించి క్వారీని సీజ్ చేసింది. నిర్వాహకులు మాత్రం పైసా కూడా చెల్లించకుండానే ఇటీవల క్వారీలో
తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఇది అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో ఏర్పాటైన రోడ్డు మెటల్ క్వారీ. ఇక్కడ ఒక హెక్టార్‌లో రోడ్డు మెటల్ తవ్వకాలకు లీజు పొందిన
ఎం.జ్ఞానేశ్వర్ గనులశాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వి తరలించేశాడు. 2022 మార్చి 10న గనులశాఖ అధికారులు క్వారీని తనిఖీ చేసి రూ.1.31 కోట్ల మేర ఖనిజాన్ని అక్రమంగా తరలించారని నిర్ధారించి క్వారీని సీజ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వారీలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకుడు.. ఇప్పటికే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలించేశాడు.
మనల్నెవడ్రా ఆపేది!


