తిరుగుతూనే ఉన్నాం.. కనికరించండి
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు
● వివిధ సమస్యలపై 450 వినతులు
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము.. కనికరించి మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్‌రెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 450 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు
వినతుల్లో కొన్ని...
● శింగనమల మండలం వెస్ట్ నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, గ్రామంలో సర్వే నంబరు 152–1లో 2.98 ఎకరాల గ్రామ కంఠం భూమిని పాఠశాలకు కేటాయించాలని కృష్ణారెడ్డి, గ్రామస్తులు కోరారు.
● సర్వజనాస్పత్రిలో సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ సుదీర్ఘకాలంగా విధులకు హాజరు కాకపోయినా వేతనం మాత్రం తీసుకుంటున్నారని జైభీమ్ రావ్ భారత్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్పనాయక్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలన్నారు.
● అట్రాసిటీ కేసు బాధితులకు ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ల ఎల్లన్న కోరాడు.
● ముసలివారమనే కనికరం కూడా లేకుండా ఇంటి నుంచి తమ కోడలు వెళ్లగొడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని రాప్తాడుకు చెందిన వృద్ధ దంపతులు నాగన్న, నాగమ్మ విజ్ఞప్తి చేశారు. ఇద్దరు కుమారులు సంతానం కాగా, ఇద్దరికీ పెళ్లయ్యిందన్నారు. రాప్తాడులో ఆటో స్టాండ్ పక్కనే రూ.8 కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాల పొలాన్ని ఇద్దరు కుమారులకు పంచి ఇవ్వడంతో పాటు మూడు సెంట్లలో మూడు ఇళ్లు కట్టించామన్నారు. ఇటీవల ఒక కుమారుడు చనిపోగా, అప్పటి నుంచి అతని భార్య తమను ఇంటి నుంచి వెళ్లగొడుతోందని వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.


