కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, సచివాలయాలు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు నిర్మించడంతో పాటు ప్రతి శుక్రవారం అందరూ డ్రై డే పాటించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలోనూ రెండు చొప్పున వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడంతో పాటు నిర్మాణాలూ పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 60 గ్రామాల్లో వ్యక్తిగత సోక్‌పిట్‌ల కోసం పరిపాలన అనుమతులు తీసుకుని డిసెంబరు 20 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జనవరి మూడో శనివారం నాటికి మరో 100 గ్రామాలకు పరిపాలన అనుమతులు తీసుకుని ఫిబ్రవరి 20వ తేదీలోపు సోక్‌పిట్‌ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పాడైన బోరుబావులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక గార్బెజ్ పాయింట్‌ను గుర్తించి చెత్తనూ పూర్తిగా తొలగించి, అక్కడ మొక్కలు నాటాలన్నారు. డ్వామా, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, డీపీఓ నాగరాజునాయుడు, డ్వామా పీడీ సలీమ్‌బాషా, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, హెచ్చెల్సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.


