ఏ మొహం పెట్టుకుని రైతుల ముందుకొస్తావ్?
● సీఎం చంద్రబాబు తీరుపై
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ధ్వజం
ఉరవకొండ: సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజైనా రైతుల గురించి ఆలోచించని చంద్రబాబు నేడు ఏ మొహం పెట్టుకుని వారి ముందుకొస్తారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఒక్క గింజ అయినా కొన్నారా అని నిలదీశారు. అరటి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కన్పించదా అంటూ ప్రశ్నించారు. గతంలో అరటి టన్ను రూ.25 వేలు పలికితే నేడు రూ. 2 వేలు కూడా పలకడం లేదని, దీంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. టమాట, ఉల్లి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పత్తికి ప్రభుత్వం క్వింటా రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించినా ఎక్కడా కొనుగోలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 మద్దతు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. చాలా ప్రాంతాల్లో రైతులు క్వింటా రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకూ కేవలం రూ.10 వేలు చెల్లించారని, ఇంకా రూ. 30 వేలు చెల్లించకుండా మోసగించారని మండిపడ్డారు. రబీలో జిల్లాలోనే అత్యధికంగా ఉరవకొండ ప్రాంతంలో పప్పుశనగ సాగు చేస్తారని, అయితే చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై విత్తనం అందించకపోవడంతో రైతులు బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని వాపోయారు. విత్తనం వేసి కలుపులు తీసే సమయంలో రైతులను మభ్యపెట్టడానికి విత్తనం ఇస్తున్నట్లు డ్రామా ఆడి చివరికి వాటిని కూడా టీడీపీ నేతలు అమ్ముకొనేలా చేశారన్నారు.
వైఎస్ జగన్ హయాంలోనే రైతు సంక్షేమం..
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యాన రైతులకు అడుగడుగునా అండగా నిలిచారని ‘విశ్వ’ గుర్తు చేశారు. పంటలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసి రైతులకు మేలు చేశారన్నారు. జగనన్న హయాంలో 54 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఆదుకుందని, చంద్ర బాబు ప్రభుత్వంలో మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పడంతో కేవలం 19 లక్షల మంది మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. హార్టికల్చర్ రైతులకు కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వైఎస్ జగన్ అందించారని కొనియాడారు. గ్రామాల్లోనే రైతులకు ఆర్‌బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి కష్టం లేకుండా చూశారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, పార్టీ రాష్ట్ర నాయకులు హవళిగి భరత్‌రెడ్డి, బసవరాజు, ఓబన్న, రాజేష్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, పార్టీ నాయకులు జిలాన్, ఆసీఫ్, పచ్చిరవి తదితరులు పాల్గొన్నారు.


