గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయదుర్గం
రాయదుర్గంటౌన్: ప్రథమ శ్రేణి (గ్రేడ్–1) మునిసిపాలిటీగా రాయదుర్గంను అప్‌గ్రేడ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ దివాకర్‌రెడ్డి తెలిపారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ పొరాళ్ల శిల్ప హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేయాలని గత నెలలో జరిగిన కౌన్సిల్ మీట్‌లో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించినట్లు గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ పాలకవర్గంలో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం తమకు గర్వంగా ఉందన్నారు. 1963 అక్టోబర్1న రాయదుర్గం పురపాలక సంఘం ఏర్పాటైంది. 2001 మే 18న ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. తాజాగా ప్రథమశ్రేణికి చేరడంతో పట్టణంలో సౌకర్యాల కల్పనతో పాటు నిధుల వెసులుబాటు కలిగి అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుంది.
ముగిసిన సత్యసాయి శత జయంతి వేడుకలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి వేడుకలు సోమవారంతో ముగిశాయి. నవంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సెంటర్లను కలుపుతూ ప్రపంచ సదస్సును నిర్వహించింది. నవంబర్ 18న జరిగిన సత్యసాయి రథోత్సవం భక్తులను సాయినామంతో పులకింపజేసింది. 22న జరిగిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. 23న సత్యసాయి శత జయంతితో బాబా భక్తకోటి మురిసిపోయింది. లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి సత్యసాయికి ఆత్మనివేదనను అర్పించుకున్నారు. చిత్రావతి నదిపై, సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన లేజర్ షోలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
40 శాతం సబ్సిడీతో
విత్తన వేరుశనగ
అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటగా నీటి వసతి కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో విత్తనం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాకు 7,300 క్వింటాళ్లు కేటాయించగా అందులో కే–6 రకం 6 వేల క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 1,300 క్వింటాళ్లు కేటాయించినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ అధికారులు తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9,200 కాగా అందులో 40 శాతం రూ.3,680 పోనూ రూ.5,520 ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోలు కలిగిన మూడు బస్తాలు పంపిణీ చేస్తామని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఆర్‌ఎస్‌కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వేరుశనగ విత్తుకునేందుకు ఈనెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు.


