హంద్రీ–నీవాను 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలి
● శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి డిమాండ్
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వితే 2,200 క్యూసెక్కులు మాత్రమే వస్తాయని, అలా కాకుండా 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వెడల్పు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వానికి శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి సూచించారు. వజ్రకరూరు మండలం ఛాయపురంలో సీఎం పర్యటన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జీడిపల్లి రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.68 టీఎంసీల మాత్రమే నీటిని నిల్వ చేస్తున్నారన్నారు. దీని సామర్థ్యాన్ని 4 టీఎంసీలు చేయడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.675 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం ఆమోదిస్తే రాయలసీమకు తాగు, సాగునీరు అందుతుందన్నారు. హంద్రీనీవా ద్వారా 70 నుంచి 80 టీఎంసీల వరకు నీటిని తీసుకోరావాలంటే కాలువను మరింత వెడల్పు చేయాలన్నారు. లైనింగ్ పనులతో ఉమ్మడి జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
కోడిని తిన్న కుక్క...
పలువురిపై కేసు నమోదు
యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామంలో రెండు రోజుల క్రితం పెంపుడు కోడిని ఓ కుక్క తినింది. దీంతో చోటు చేసుకున్న ఘర్షణలో పుల్లయ్య కుమారుడు వీరాంజనేయులును అదే గ్రామానికి చెందిన రాధక్క, అరుణ్, రామాంజనేయులు చితకబాదారు. ఘటనపై బాధితుడు బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు రాధక్క, అరుణ్, రామాంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే తనపై పుల్లయ్య, వీరాంజనేయులు, మల్లేశ్వరి దాడి చేసి కొట్టారంటూ బాధిత రాధమ్మ చేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


