
No Headline
అనంతపురం: ఓట్ల లెక్కింపు ఘడియలు దగ్గరయ్యే కొద్దీ ఉద్విఘ్న వాతావరణం నెలకొంటోంది. ఈ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జిల్లావ్యాప్తంగా పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎన్నికల ఫలితాల ముందుగానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్ ప్రోగ్రాంలకు ఎటువంటి అనుమతుల్లేవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకుల సందేశాలు, నిరాధార ఆరోపణలు, రచ్చబండ చర్చలు, సోషల్ మీడియాలో ప్రచారం మొదలైన వాటిని నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలతో పాటు బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. జూదం, కోడిపందేలు, బెట్టింగ్ మొదలైన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా, మద్యం, వస్తువులు అక్రమ రవాణా జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే 6,289 మంది బైండోవర్
సీఐ, ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్, పెట్రోలింగ్, ఔట్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా 6,289 మందిని బైండోవర్ చేశారు. 136 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు.మట్కా, అక్రమ మద్యం, గుండాగిరీ చేస్తున్న 8 మందిని జిల్లా నుంచి బహిష్కరించారు.
స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రత
ఒక వైపు శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటూనే, మరో వైపు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు, ఆర్మ్‌డ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటలూ నిరంతర సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బలగాల పహారా ఏర్పాట్లు ఉన్నాయి.
జిల్లాలో 24 గంటలూ
పటిష్ట పోలీసు నిఘా
జూన్ 4న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భద్రత పెంపు
సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
గ్రామాల్లో గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు

No Headline