కూడేరు: పది తర్వాత ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న కూడేరు మండల విద్యార్థుల ఇక్కట్లు దూరం చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకూ ఇంటర్, ఆపై చదువులకు కూడూరు మండలంలోని విద్యార్థులు ఉరవకొండ, అనంతపురానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తెస్తూ ప్రభుత్వం కూడేరులోనే జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సం నుంచే తరగతుల ప్రారంభానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే జూనియర్ కళాశాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ బ్లాక్‌ను కేటాయించారు. జూనియర్ కళాశాల ఏర్పాటుపై జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఎంపీసీ, బైపీసీ గ్రూపులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారన్నారు. కో–ఎడ్యుకేషన్ విధానం కొనసాగుతుందన్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని, దరఖాస్తులు ఉన్నతపాఠశాలలోనే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండలంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరానికి ప్రవేశాలు
దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు