మంచితనమే మరణశాసనమైంది..!

young man commits suicide In Ananthapur - Sakshi

కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలవడమే ఆ యువకుడి ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ వ్యక్తిని నమ్మి ఫైనాన్స్‌ ద్వారా లోన్‌ ఇప్పించడమే ప్రాణాలు తీసుకునేలా చేసింది. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమ కళ్లముందే విగతజీవిగా పడి ఉండడం చూసి కన్నవాళ్లు చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఎంతో గొప్ప మనసుతో ఓ కుటుంబానికి అండగా నిలిచిన తమ కుమారుడిని తీసుకెళ్లడానికి నీకు చేతులెలా వచ్చాయి దేవుడా అంటూ వారు విలపించిన తీరు అక్కడి వారిని కదిలించింది.

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: ఫైనాన్స్‌ కంపెనీ వారి వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవిశంకరరెడ్డి తెలిపిన మేరకు.. అనంతపురం ఉమానగర్‌లో నివాసముంటున్న బలరాం, లక్ష్మిదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు కృష్ణ (26) ప్రభుత్వాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోలర్‌గా పని చేస్తున్నాడు. ఉమానగర్‌లోనే నివసిస్తున్న కేశవనాయుడు ఈ కుటుంబానికి దగ్గరయ్యాడు. కృష్ణ ఆయనను చిన్నాన్న అని ఆప్యాయంగా పలకరించేవాడు.

కొన్ని రోజుల క్రితం కేశవనాయుడు తనకు ఫైనాన్స్‌లో గూడ్స్‌ వెహికల్‌ ఇప్పించమని కోరగా.. శ్రీరామ్‌ సిటీ ఫైనాన్స్‌లో బొలేరో వాహనాన్ని కృష్ణ ఇప్పించాడు. అయితే, కేశవనాయుడు కంతులను సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ వారు కృష్ణను వేధించడం ప్రారంభించారు. పలుమార్లు ఇంటి వద్దకు వెళ్లి గొడవ చేశారు. తల్లిదండ్రులను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కృష్ణ ద్విచక్రవాహనాన్ని సైతం లాక్కెల్లారు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఇలా చేయడం బాగాలేదని కృష్ణ ఆవేదన వ్యక్తం చేయగా.. నోటీసు అందజేసి నిన్ను కోర్టుకు లాగి ఆస్తి జప్తు చేయిస్తామంటూ హెచ్చరించారు.

దీంతో మనస్తాపం చెందిన కృష్ణ ఇంట్లో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. బాధలో ఉన్నాడు? అతన్ని ఇబ్బంది పెట్టడడం ఎందుకని కుటుంబసభ్యులూ కృష్ణతో మాట్లాడలేదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఫ్యానుకు ఉరి వేసుకుని కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు కిందకు దించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top