టపాసుల విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత
ఇష్టానుసారం బాణసంచా ధరలు
ప్రమాదకరంగా బాణసంచా దుకాణాల ఏర్పాటు
ఎక్కడా కనిపించని రేకుల షెడ్లు, చిన్న చిన్న గుడ్డ టెంట్లలో.. పెద్ద మొత్తంలో బాణసంచా నిల్వ
2008 పేలుడు పదార్థాల నిబంధనలు గాలికి
భారీగా జీఎస్టీ ఎగవేత
యలమంచిలి రూరల్: సాధారణంగా ఏ వస్తువు కొన్నా వాటిపై ముద్రిత గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ), తయారీ తేదీ, ఇతర వివరాలు స్పష్టంగా ఉంటాయి.కొనుగోలుదారునికి వస్తువు కొన్న ధరకు సరిపడా సక్రమమైన బిల్లు విక్రయదారు ఇస్తారు. కానీ దీపావళి పండగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణసంచా అమ్మకాల్లో బిల్లులు లేకుండా నాసిరకం సరుకు విక్రయాలు జోరుగా జరిగాయి. ప్రతి ఏడాదివలే ఈ సారి కూడా వినియోగదారులంతా రూ.కోట్లలో నష్టపోయారు. మోసపోయామని తెలిసినా విక్రయదారులను ఏమీ చేయలేని వింత పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక,స్థానిక అధికారులకు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ప్రజలు నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. టపాసుల ధరలు ఇష్టానుసారం పెంచి అమ్మకాలు చేసినా అడిగేనాథుడే కరువయ్యారు. జిల్లాలో బాణసంచా అమ్మకాల్లో ఎక్కువశాతం జీరో బిజినెస్ జరిగిపోయింది. కొనుగోళ్లకు సంబంధించి వ్యాపారులెవరూ వినియోగదారులకు బిల్లులు ఇవ్వలేదు. ఒకవేళ ఎక్కడైనా ప్రజలు వ్యాపారులను బిల్లు అడిగితే చిన్న చిన్న తెల్ల కాగితం ముక్కలపై అర్థంకాని విధంగా ధరలు రాసిస్తున్నారు. చాలా మంది వ్యాపారులు బిల్లులు ఇవ్వకుండా, బిల్లులు అడిగిన వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, కస్సుబుస్సులాడడం కనిపించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ రూపంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం ఎగవేతకు గురి కావడం, ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోవడం మామూలుగానే జరిగిపోయాయి. జిల్లాలో చాలా చోట్ల అనుమతి లేకుండా చిన్న చిన్న పాన్ షాపుల్లో కూడా బాణసంచా సామగ్రి పెట్టి దర్జాగా విక్రయించినా అధికారులెవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.
ప్రమాదకరంగా బాణసంచా అమ్మకాలు
నిబంధనల ప్రకారం తాత్కాలిక బాణసంచా దుకాణాలను ప్రత్యేకంగా తయారు చేసిన జింక్,జీఐ రేకులతో ఏర్పాటు చేయాలి. 90శాతం వరకు దుకాణాలను చిన్న టెంట్లు వేసి అయిందనిపించారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన హరిత టపాసులను మాత్రమే విక్రయించాల్సి ఉండగా నాశిరకం టపాసులను విక్రయించారు.గుర్తింపు లేని స్థానిక బ్రాండ్ల టపాసులే ఎక్కువగా విక్రయించారు. అమ్మకాల కోసం దుకాణాల వద్ద బాణసంచా సామగ్రిని ప్రమాదకరంగా ప్రదర్శించారు. ప్రతి దుకాణం వద్ద ఉండాల్సిన అగ్ని నిరోధక పరికరాలు ఎక్కడా కనిపించలేదు. అనుమతుల్లో భాగంగా పొందుపరిచిన నిబంధనలు పాటించకపోయినా చర్యలు తీసుకోవాల్సిన ఫైర్,రెవెన్యూ,పోలీస్ శాఖల అధికారులెవరూ దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక దుకాణదారుల నుంచి అందిన మామూళ్లే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
3వేల సరుకు కొనుగోలు చేశా బిల్లు ఇవ్వలేదు..
యలమంచిలి రామచంద్రమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణసంచా దుకాణం వద్ద రూ.3 వేల రూపాయల బాణసంచా సామాన్లు కొనుగోలు చేశాను. కానీ ఎలాంటి బిల్లు ఇవ్వలేదు. బాణసంచా సామాన్ల కవర్లు, పెట్టెలపై ముద్రించిన ఎంఆర్పీ ఇష్టారాజ్యంగా ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.
–శివ నాగేశ్వరరావు, యలమంచిలి
బిల్లు అడిగితే లేదన్నారు
దీపావళి సందర్భంగా ఆదివారం యలమంచిలిలో ఒక దుకాణంలో బాణసంచా కొనుగోలు చేశాను. టపాసులు ఎంపిక చేసుకున్న తర్వాత రూ.950 ఇమ్మన్నారు. బిల్లు ఇవ్వమని అడిగితే దుకాణదారు మా దగ్గర బిల్లులు లేవు..ఇష్టముంటే కొనండి... లేదంటే వెళ్లిపోండి అన్నారు. నిబంధనలు పక్కన పెట్టి బాణ సంచా అమ్మకాలు చేస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. –నూకరాజు, జంపపాలెం
జిల్లాలో ఈ నెల 6,7,8 తేదీల్లో దీపావళి బాణసంచా అమ్మకాల్లో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. జిల్లా వ్యాప్తంగా 350కు పైగా తాత్కాలిక బాణసంచా అమ్మకాలు అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డరోడ్డు ఆర్డీవోలు అనుమతులు మంజూరు చేశారు. 2008 పేలుడు పదార్థాల నిబంధనల ప్రకారం అనుమతించిన బాణసంచా అమ్మకాల దుకాణాల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదు. 50 కేజీల లోపు బరువున్న బాణసంచా సామాన్లు మాత్రమే కలిగి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నా.. ఒక్కో వ్యాపారి 500 కేజీల నుంచి టన్నుల బరువున్న బాణసంచా విక్రయించారు. జిల్లాలో శాశ్వత లైసెన్సు కలిగిన హోల్ సేల్ వ్యాపారుల నుంచి చిన్న వ్యాపారులు ఒక్కొక్కరు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కొనుగోలు చేశారు. మొత్తం దుకాణదారులంతా కలిపి కనీసం రూ.20 కోట్ల వరకు బాణసంచా కొనుగోలు చేశారు. బాణసంచాపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అంటే రూ.3.6 కోట్ల వరకు జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ చాలా తక్కువ మొత్తంలో పన్నుల శాఖకు జీఎస్టీ చెల్లించినట్టు తెలుస్తోంది. హోల్‌సేల్ వ్యాపారులు చిన్న వ్యాపారులకు ఇచ్చే బిల్లులన్నీ తప్పుడు వివరాలతోనే ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసిన వారంతా కొనుగోలుదారులకు అసలు బిల్లులే ఇవ్వడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా బాణసంచా దుకాణాల వద్ద ధరల పట్టికలు ఏర్పాటు చేయలేదు. ఇంత జరుగుతున్నా పన్నుల శాఖ అధికారులు మాత్రం కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.


