డీపీవోకు యూటీఎఫ్ నాయకుల వినతి
తుమ్మపాల: త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల విధుల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, ఆరోగ్యపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని అర్హులైన ఉద్యోగులకు మినహాయింపులు కల్పించడంతో పాటు, ఎన్నికల విధుల్లో తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటూ యూటిఎఫ్ నాయకులు జిల్లా పంచాయతీ అధికారి ఎం.కిరణ్‌కుమార్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు సుదూర ప్రాంతాల్లో కాకుండా నివాస ప్రాంతాలకు సమీపంలోని మండలాలు, నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించాలని కోరారు. ఎన్నికల సామగ్రి అప్పగింతలో జాప్యం కారణంగా దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరుసటి రోజును ఆన్ డ్యూటీగా పరిగణించేలా సంబంధిత శాఖాధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. 60 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు, క్యాన్సర్, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు, డయాలసిస్, గుండె శస్త్రచికిత్స, ఎపిలెప్సీ, స్పాండిలైటిస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గర్భిణీ ఉద్యోగులు, పాలిచ్చే తల్లులు, 50 శాతం, అంతకంటే ఎక్కువ అంగవైకల్యం కలిగిన దివ్యాంగ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద ముందురోజు రాత్రి బస చేయాల్సి వచ్చే ఉద్యోగులకు వసతి, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి మామిడి బాబురావు, సీనియర్ నాయకులు యాదగిరి రాము, పెదపూడి కరుణ జ్యోతి పాల్గొన్నారు.


