సమ్మిట్‌లో సర్దేసుకుందాం! | - | Sakshi
Sakshi News home page

సమ్మిట్‌లో సర్దేసుకుందాం!

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

12, 13 తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు

ఎంవోయూల సంఖ్య భారీగా

చూపించుకునేందుకు అధికార పార్టీ

నేతల ఆరాటం

బ్రిక్స్‌, టైల్స్‌ తదితర వ్యాపారుల పేర్లతో

జాబితాల తయారీ

గతంలోనూ తమ అనుచరులతో

ఎంవోయూలు చేయించి భంగపడ్డ టీడీపీ

ఇప్పుడు మళ్లీ అదే తరహా కసరత్తు

ఖాళీ ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన

కూటమి నేతలు

సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి ముసుగులో విశాఖ సాగరతీరం సాక్షిగా మరో భూ దందాకు రంగం సిద్ధమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కంటే అధికార కూటమి నేతల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాగితాలకే పరిమితమైన ఎంవోయూల తరహాలోనే మరోసారి భారీ ఒప్పందాల ప్రచారానికి తెరతీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల స్థాపన పేరుతో ప్రభుత్వ ఖాళీ స్థలాలను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అంకెల గారడీకి రంగం సిద్ధం!

సదస్సులో భారీ సంఖ్యలో ఎంవోయూలు కుదిరినట్లు చూపించుకునేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇందుకోసం క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా బ్రిక్స్‌, టైల్స్‌ తదితర వ్యాపారాల వారీగా జాబితాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ వ్యాపారాలు నిర్వహించే వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా చూపిస్తూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం తమ అనుచరులతోనే ఎంవోయూలు చేయించుకుని, తర్వాత పరిశ్రమల స్థాపనలో పురోగతి సాధించలేకపోయారనే విమర్శలున్నా మళ్లీ అదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

కూటమి నేతలకు భూ నజరానా?

ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల ఆకర్షణ కంటే అధికార పార్టీకి చెందిన నేతలు, అనుచరులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టేందుకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తల ముసుగులో ప్రభుత్వ రాయితీలు, భూములు పొందేందుకు పావులు కదుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఏపీఐఐసీ, పర్యాటక శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలపై కూటమి నేతలు కన్నేశారని, చిన్న తరహా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించే వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా చూపించి భూములు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పారిశ్రామిక విధానంపై ప్రశ్నలు

పరిశ్రమల శాఖను కొందరు నేతలు తమ ప్రయోజనాలకు వేదికగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2016, 2018, 2025 సంవత్సరాల్లో నిర్వహించిన సదస్సుల్లో కుదిరిన ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరోసారి ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యమిస్తే పెట్టుబడుల లక్ష్యం నీరుగారడమే కాకుండా ప్రభుత్వ భూముల కేటాయింపులపైనా అనుమానాలు తలెత్తుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement