ప్రజాస్వామ్యంపై
అధికారాన్ని అడ్డుపెట్టుకుని
కూటమి నేతల అరాచకాలు
రాత్రికి రాత్రే పెరిగిన పోలింగ్..
సీల్ లేని బ్యాలెట్ బాక్సులు
రీకౌంటింగ్లతోనూ
ఫలితాల తారుమారు
జీవీఎంసీ మేయర్‌గా ముక్కా శ్రావణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల దౌర్జన్యాలు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన రాజకీయ కుట్రలు.. ఎన్నికల నిబంధనలకు తూట్లు.. వెరసి జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాత్రికి రాత్రే పెరిగిన పోలింగ్ శాతం.. సీల్ వేయకుండానే స్ట్రాంగ్ రూమ్‌లకు చేరిన బ్యాలెట్ బాక్సులు.. ఎన్నికల నిర్వహణలో అధికారుల తీరుపై సందేహాలు రేకెత్తించాయి. నిబంధనలను పక్కనపెట్టి కూటమి నేతలు చెప్పిందే అమలుచేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ.. రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను మార్చి కూటమి అభ్యర్థులనే విజేతలుగా ప్రకటించారన్న విమర్శలు వినిపించాయి. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి దశలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య జీవీఎంసీపై కూటమి ఆధిపత్యం సాధించినట్లు ప్రకటించగా.. అధికారులు ఫలితాలను ధ్రువీకరించారు. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి సుమారు 2.01 లక్షల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై విజయం సాధించారు.
కార్పొరేటర్ స్థానాల్లో కూటమి ఆధిపత్యం
జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవితోపాటు అత్యధిక కార్పొరేటర్ స్థానాలను కూటమి అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. మొత్తం 120 కార్పొరేటర్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీకి 64 స్థానాలు, జనసేనకు 26 స్థానాలు, వైఎస్సార్సీపీకి 13 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు, సీపీఎంకి ఒక స్థానం, స్వతంత్రులకు 8 స్థానాలు దక్కాయి. మేయర్ పదవికి మొత్తం 15 మంది పోటీపడగా కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి విజయం సాధించారు.
ఓట్లు.. బ్యాలెట్ బాక్సుల హైజాక్
ఈ విజయం ప్రజల మద్దతుతోనే సాధించిందా? లేక ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాల ప్రభావం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతల కుట్రలు, బ్యాలెట్ బాక్సుల నిర్వహణలో జరిగిన అవకతవకలే ఫలితాలను ప్రభావితం చేశాయని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరుగుతోందన్న సంకేతాలు రావడంతో కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాల్లోని పలు వార్డుల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. ఆ పార్టీ సానుభూతిపరులు కనిపిస్తే చాలు.. వారితో వాగ్వాదానికి దిగి, పోలింగ్‌కు ఆటంకం కలిగించారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో వందలాది బ్యాలెట్ పత్రాలతో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల బయట తిరిగారన్న ఆరోపణలు ఎన్నికల నిర్వహణ తీరుపై సందేహాలు రేకెత్తించాయి. దక్షిణ నియోజకవర్గంలో రిగ్గింగ్ జరుగుతోందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలను పోలీసులు నిలువరించారని, అధికార పార్టీ నేతల పట్ల మాత్రం ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు.
సీల్ వేయకుండానే స్ట్రాంగ్ రూమ్‌లకు బాక్సులు!
ఎన్నికల నిర్వహణలో అధికారుల వ్యవహారశైలిపైనా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారమే పోలింగ్ శాతంలో భారీ వ్యత్యాసం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 10 గంటలకు మొత్తం 9,45,915 ఓట్లు పోలయ్యాయని, 51.47 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే మరుసటి రోజు ఉదయం వెల్లడించిన గణాంకాల్లో ఏకంగా 56.32 శాతం పోలింగ్ నమోదైనట్లు, 10,35,154 ఓట్లు పోలైనట్లు పేర్కొన్నారు. ఒక్క రాత్రిలోనే 89,239 ఓట్లు అదనంగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడించడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యత్యాసానికి అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులకు పోలింగ్ కేంద్రాల వద్దే ఏజెంట్ల సమక్షంలో సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాల్సి ఉండగా.. కొన్ని బాక్సులకు సీల్ వేయకుండానే తరలించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లో బాక్సులను భద్రపరిచిన వెంటనే సుమారు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడికి చేరుకుని అధికారులను నిలదీశారు. బ్యాలెట్ బాక్సుల భద్రత, సీల్ వేయకుండా తరలించిన అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ 64 – 1, 2, 3, 4, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 35, 38, 44, 45, 47, 48, 49, 50, 51, 52, 55, 56, 60, 61, 63, 64, 66, 67, 68, 69, 70, 71, 72, 74, 77, 78, 82, 83, 87, 89, 90, 91, 96, 97, 100, 101, 107, 108, 116, 117, 120
జనసేన 26– 5, 11, 12, 26, 31, 32, 33, 34, 37, 40, 43, 46, 62, 75, 79, 80, 93, 95, 102, 103, 109, 110, 112, 113, 114, 115
వైఎస్సార్సీపీ 13 – 6, 7, 19, 42, 59, 65, 76, 84, 92, 94, 99, 104, 119
బీజేపీ – 8 – 53, 54, 57, 58, 81, 85, 88, 111
సీపీఎం – 1 – 105
స్వతంత్రులు– 8– 36, 39, 41, 73, 86, 98, 106, 118
మేయర్ ఓట్ల లెక్కల్లో తేడాలు?
కూటమి విజయం వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయన్నది స్పష్టమవుతోంది. రాత్రి 10 గంటలకల్లా మేయర్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 10.30కి డిక్లరేషన్ ఫారం ఇస్తామంటూ కలెక్టర్ ప్రకటించారు. అయితే.. మొత్తం ఓట్లు కూడే సమయంలో కూటమి నేతల రిగ్గింగ్ బాగోతం బట్టబయలైంది. మూడు రౌండ్లలో మేయర్ ఓట్ల లెక్కింపు జరిగింది. దాదాపు 10 వార్డుల్లో పోలైన ఓట్లకు.. కౌంటింగ్ సమయంలో ఓట్లకు పొంతన కుదరలేదు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు తుది ఫలితాలు వెల్లడించడంలో తీవ్ర జాప్యం చేశారు. రాత్రి 9.30 గంటలకే కౌంటింగ్ ముగిసినా అర్ధరాత్రి ఒంటిగంట దాటినా తుది ఫలితం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులు, కూటమి నేతలు కలిపి.. పోలైన ఓట్లు, వచ్చిన ఓట్లు లెక్క సరిపోయేలా సుదీర్ఘ కసరత్తులు చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు గానీ, ఉదయం గానీ డిక్లరేషన్ ఫారం ఇస్తామంటూ మీడియాతో అధికారులు చెప్పడం చూస్తుంటే.. ఓట్ల రిగ్గింగ్ వ్యవహారం ఎలా జరిగిందో సుస్పష్టమవుతోంది.


