తాటిచెట్లపాలెం: మురసు తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఆయా విభాగాల ప్రిన్సిపల్ హెడ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ జోన్ పరిధిలో తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ ఎక్విప్‌మెంట్‌లు, వంతెనల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫీల్డ్ సూపర్‌వైజర్లు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మురసు తుపాను దృష్ట్యా జోన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. జోనల్ ప్రధాన కార్యాలయం, డివిజనల్ కార్యాలయాల్లో 24/7 అధికారులు అందుబాటులో ఉండి పరిస్థితిని సమీక్షించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, వాతావరణ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని జీఎం ఆదేశించారు.


