సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరిధిలోని మున్సిపల్, జీవీఎంసీ ఎన్నికలలో కూటమి ప్రభంజనం సృష్టించింది. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలను కూటమి కై వసం చేసుకుంది. అదే విధంగా జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని ఆరు వార్డుల్ని కూటమి అభ్యర్థులు కై వసం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై సంక్షేమ పథకాల పరంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ నమోదైన ఓట్లను బట్టి కూటమి బలపర్చిన అభ్యర్థుల్నే విజయం వరించింది. యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పిళ్లా రమాకుమారి(బీజేపీ) తన సమీప ప్రత్యర్ధి బి.తులసి (వైఎస్సార్‌సీపీ)పై 3,856 ఓట్ల తేడాతో గెలుపొందారు. నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి(టీడీపీ) తన సమీప ప్రత్యర్థి చింతకాయల అనిత(వైఎస్సార్‌సీపీ)పై 11,519 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులకుగానూ ఆరు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అదే విధంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వైఎస్సార్‌సీపీ తరపున ఒక అభ్యర్థి వార్డు సభ్యునిగా గెలుపొందారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియల్ని కలెక్టర్ విజయ్‌కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పరిశీలించారు. జీవీఎంసీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో నిర్వహించడంతో అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు విశాఖకు వెళ్లారు. గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలగా, ఓటమి చెందిన అభ్యర్థులు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఆయా పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు గెలుపోటములకు సంబంధించిన లెక్కల్ని వేసుకొనే పనిలో నిమగ్నం అయ్యారు.
మూగబోయిన మైకులు, ప్రలోభాలకు తలుపులు...
అనకాపల్లి జిల్లా పరిధిలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న మండల పరిషత్,జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది.దీంతో ఆయా అభ్యర్థులు ప్రచార ఘట్టాన్ని ముగించారు.గెలుపు కోసం అవకాశం ఉన్న మిగిలిన గడువును ఉపయోగించుకునుందుకు ప్రలోభాలకు తెరలేపారు.ఓటర్లను గేలం వేసేందుకు ఉన్న అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తున్నారు.జడ్పీటీసీ ఎన్నికలకు గానూ 24 మండలాల పరిధిలో 80 మంది పోటీలో ఉన్నారు.425 ఎంపీటీసీ స్థానాలకు గానూ పోటీలో ఉన్న అభ్యర్థులు విజయం కోసం పోరాడుతున్నారు.జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పోలింగ్,కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు.


