విశాఖలో టైగర్‌ ట్రయంఫ్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

విశాఖలో టైగర్‌ ట్రయంఫ్‌ షురూ

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

సింథియా: భారత్‌–అమెరికా సంయుక్త త్రివిధ దళాల మానవతా సహాయం, విపత్తు నిర్వహణ విన్యాసాలు ‘టైగర్‌ ట్రయంఫ్‌–2026’ ఐదో ఎడిషన్‌ ప్రారంభోత్సవాన్ని విశాఖలోని మారిటైమ్‌ వార్‌ఫేర్‌ సెంటర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారీ స్థాయిలో మానవతా సహాయం, విపత్తు నిర్వహణ కార్యకలాపాలు చేపట్టే సమయంలో ఇరుదేశాల సాయుధ దళాల మధ్య సమన్వయం, ఉమ్మడి ప్రణాళికలు, పరస్పర సహకార సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. ప్రారంభోత్సవానికి భారత నౌకాదళ తూర్పు నౌకాదళ దళాధిపతి రియర్‌ అడ్మిరల్‌ విశాల్‌ బిష్టోయ్‌, అమెరికా పసిఫిక్‌ నౌకాదళ వైస్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ జోక్విన్‌ జె.మార్టినెజ్‌ డి పినిల్లోస్‌ అధ్యక్షత వహించారు. భారత్‌–అమెరికా మధ్య సముద్ర రంగంలో పెరుగుతున్న వ్యూహాత్మక ప్రయోజనాల సమన్వయంతో పాటు బలపడుతున్న రక్షణ భాగస్వామ్యానికి ఈ విన్యాసాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

భారత్‌ తరఫున పాల్గొంటున్న దళాలు

భారత నౌకాదళానికి చెందిన సముద్ర కార్యకలాపాల నిపుణులు, భారత సైన్యంలోని భూదళాలు, భారత వైమానిక దళంలోని వివిధ విభాగాల ప్రతినిధులతో పాటు మూడు సాయుధ దళాలకు చెందిన ప్రత్యేక దళాల సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. తొలిసారిగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందం కూడా భాగస్వామ్యమవుతోంది.

అమెరికా తరఫున పాల్గొంటున్న దళాలు

అమెరికా తరఫున వైమానిక దళం, సైన్యం, మైరెన్‌ కార్ప్స్‌, నౌకాదళానికి చెందిన వివిధ విభాగాల నిపుణులు పాల్గొంటున్నారు. వీరితో పాటు అంతరిక్షం, సైబర్‌ కార్యకలాపాలు, వైద్య సేవలు, పేలుడు పదార్థాల నిర్వీర్యం వంటి కీలక విభాగాలకు చెందిన నిపుణులు కూడా పాల్గొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement