మొదట్లో విడుదల చేసిన రిజర్వేషన్లలో మార్పు
అనకాపల్లి మండలంలో
26 పంచాయతీలకు రిజర్వేషన్లు
వర్తింపజేస్తూ ఈ నెల 15న విడుదల చేసిన గెజిట్ మార్పు
13 పంచాయతీలపై పచ్చ ముద్ర
విస్తుపోతున్న రాజకీయ పార్టీలు
కోర్టును ఆశ్రయించే పనిలో అన్ని పార్టీలు
సాక్షి, అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న సంఘటనల తీరులాగే అనకాపల్లి మండలంలో నిర్వహించనున్న సర్పంచ్ ఎన్నికలపై పచ్చ ముద్ర కనిసిస్తుంది.జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనకాపల్లి మండలంలోని 13 పంచాయితీల రిజర్వేషన్లు మార్చడం ఇప్పుడు జిల్లా రాజకీయ పార్టీ వర్గాలను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంలో అధికారులు తాము చేసిన తప్పిదాన్ని సరిచేసుకున్నామని చెబుతున్నప్పటికీ రాజకీయ పార్టీలో అగ్గి రాజేస్తుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమిలో టీడీపీ నేతలే ఈ వ్యవహారంపై మండిపడుతూ కోర్టుని ఆశ్రయించే పనిలో పడుతున్నారు. ఇది ఎంత వరకూ దారి తీస్తుందో లేక టీ కప్పులో తుఫాన్‌లా చల్లబడుతుందో వేచి చూడాలి.
గెజిట్ నంబర్ 89పై వివాదం..?
అనకాపల్లి జిల్లా కలెక్టర్ సంతకంతో అక్టోబర్ 31న గెజిట్ నంబర్ 89ను విడుదల అయ్యింది.ఇది అక్టోబర్ 15వ తేదీన విడుదల గెజిట్ నంబర్ 86కు అమెండ్మెంట్గా పరిగణిస్తూ జిల్లా పౌర సంబంధాల శాఖ శనివారం విడుదల చేసింది.ఇందులో ఏం తప్పుంది..? స్వయంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఎన్నికల విధుల్లో భాగంగా గెజిట్ విడుదల చేయడం మామూలు ప్రక్రియ అనే అందరూ భావించాలి కూడా.అయితే ఇక్కడ చాల ట్విస్ట్‌లు ఉన్నాయి.అవేంటో చూద్దాం.26న విడుదల అయిన గెజట్ నంబర్ 89ను 31వ తేదీ వరకూ బయటకు ఎందుకు విడుదల చేయలేదు.అనకాపల్లి మండల అభివృద్ధి కార్యాలయంలో రూపొందించిన అనకాపల్లి మండలంలోని 26 పంచాయితీలకు సంబంధించిన రిజర్వేసన్లలో 13 పంచాయితీ రిజర్వేషన్లను మారుస్తూ ఈ గెజిట్ విడుదల కావడమే చర్చనీయాంశం అయ్యింది.
మారిన తలరాతలు..!
స్థానిక ఎన్నికల దగ్గర నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ పోటీ చేసే ఔత్సాహిక అభ్యర్థులు వారి పోటీ చేసే స్థానిక సంస్థలు,నియోజక వర్గాల రిజర్వేషన్ ప్రకటనపై ఉత్కంఠగా ఎదురు చూస్తారు.ఒక సామాజిక వర్గంలో బలమైన నేత పోటీ చేయాలనుకుంటే అనుకోకుండా అక్కడ వచ్చిన రిజర్వేషన్ బట్టి పోటీలో నుంచి విరమించుకోవాల్సి వస్తుంది.మళ్లీ ఐదేళ్ల వరకూ వేచి చూడాల్సిందే.అదే విధంగా అనకాపల్లి మండలంలోని 26 పంచాయితీలకు అక్టోబర్ 15న విడుదల చేసిన గెజిట్‌లో ప్రకటించిన రిజర్వేషన్ల బట్టి అభ్యర్థులు సన్నద్ధం అవుతారు.అభ్యర్థుల బలబలాలు,రిజర్వేషన్లు,ఆర్థిక,అంగ బలం బట్టి పోటీలో నిలిచేందుకు నిర్ణయించుకుంటారు.అలాగే అనకాపల్లి మండలంలోని 26 పంచాయితీలకు 26 మంది వారికి వర్తించిన రిజర్వేషన్ ప్రకారం పోటీకి సిద్ధం అవుతున్నారు.సరిగ్గా పక్షం రోజులు గడిచే సరికి మీ పంచాయితీ రిజర్వేషన్ మారిందని గెజిట్ విడుదల చేస్తే షాక్ అవ్వారా మరి.దీంతో మాకు అన్యాయం జరిగిందని పోటీకి రెడీ అయిన అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు.
అభియోగం ఏంటంటే...?
తొలుత ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఒక పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న సహకారం సంస్థ ఛైర్మన్ బంధువులకు అవకాశం లేకుండా పోయింది.ఎలాగైనా తమ గ్రామానికి కేటాయించిన రిజర్వేషన్ మార్చాలంటే పలుకుబడి ప్రయోగించాలి.అతి సత్ఫలితాన్ని ఇవ్వడంతో ఒక పంచాయితీ రిజర్వేషన్ మార్చితే అనుమానం వస్తుంది కాబట్టి 50 పంచాయితీల రిజర్వేషన్ అటూ ఇటూ మార్చితే సరిపోతుంది కదా అనేది అభియోగం.ఇదే కాకుండా 26వ తేదీతో సంతకం పెట్టిన గెజిట్‌ను 31వ తేదీ వరకూ ఎందుకు బయటకు రానివ్వలేదు.ఆ సమయంలో పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు పడుతున్నందున రిజర్వేషన్లు మారాయని తెలిస్తే రాజకీయ పార్టీలు సమర్పించే నామినేషన్ల మీద ప్రభావం పడుతుందని ఆపారా ..? అనేది ఒక కోణం.
అధికారుల వాదన ఇది..!
అక్టోబర్ 15కు ముందు ఇక్కడి ఎంపీడీవో ఆశాజ్యోతి సెలవులో ఉన్నారట.ఈ కారణంగా ఏఓగా ఉన్న అధికారే రెండు బాధ్యతలు మోస్తూ రిజర్వేషన్ల జాబితా రూపొందించారట.గెజిట్ విడుదల అయిన తర్వాత ఒక వ్యక్తి ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో అధికారి ఆదేశాల మేరకు కొత్త రిజర్వేషన్లు మార్చి గెజిట్‌ను విడుదల చేశారట.కేవలం మొదట రూపొందించిన రిజర్వేషన్లలో జనాభా నిష్పత్తి,మండల యూనిట్,గ్రామ యూనిట్,2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ప్రతిపాదికన అంటూ రిజర్వేషన్లు మార్చారని ఇక్కడి అఽధికారులు సెలవిచ్చారు.కేవలం సిబ్బంది మొదటి జాబితాలో చేసిన సాంకేతిక తప్పిదాల వల్లే రెండవ సారి రిజర్వేషన్లు మార్చాల్సిన అవసరం వచ్చిందని వివరణ వచ్చింది.
టీడీపీలో కల్లోలం..
ఈ పరిణామం నియోజక వర్గ టీడీపీలో కల్లోలాన్ని సృష్టిస్తోంది.టీడీపీలోని సహకార సంస్థ ఛైర్మన్‌కు ఆ పార్టీలోని కీలక నేతల సహకారంతో ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా తాము పోటీ చేసేందుక సన్నద్ధం అవుతున్న తరుణంలో రిజర్వేషన్లు మార్చడం వల్ల పోటీ చేయలేని పరిస్థితి వచ్చిందని మెజారిటీ టీడీపీ నేతలు వాపోతున్నారు.కోర్టుని ఆశ్రయిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.ఇదిలా ఉండగా స్థానికంగా ఉన్న జనసేన ప్రజాప్రతినిధి సహకారంతో పోటీ ఒక పంచాయితీలో పోటీ చేయాలని ఇద్దరు యువనేతలు పోటీ పడుతుండగా రిజర్వేషన్ మారడంతో ఆ ప్రజాప్రతినిధికి ఝలక్ ఇచ్చినట్లయ్యింది.ఇక్కడ ప్రజా ప్రతినిధి కంటే సహకార సంస్థ ఛైర్మన్ మాటే నెగ్గిందనే ప్రచారం మండల వర్గాలో జోరుగా సాగుతోంది.అయితే ఈ విషయంలో అధికారుల వివరణ చాలా సింపుల్‌గా ఉంది.తొలుత తయారు చే సిన జాబితాలో ఉన్న తప్పుల్ని సవరించి రెండో జాబితా రూపొందించామని,అన్ని రకాల జనాభా లెక్కలు,రిజర్వేషన్ల శాతం ఆన్లైన్లో ఉంటుందని చెప్పడం కొసమెరుపు.
స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం ఆర్.వి పాలెం గ్రామస్తులు
సాక్షి,అనకాపల్లి: అనకాపల్లి మండలం రొంగలివానిపాలెం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించిన రిజర్వేషన్లను మార్చటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి సమావేశమై తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో వలస వచ్చిన షెడ్యూల్ కులాల్లో ఆరుగురు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారని, గెజిట్‌లో రిజర్వేషన్లను బీసీ(మహిళ) నుంచి ఎస్సీ(మహిళ)కు కేటాయించడం అన్యాయమని వాపోయారు. మొదటి ప్రకటించిన రిజర్వేషన్ అమలు చేయాలని, లేకుంటే స్థానిక ఎన్నికల్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.


