మునగపాక: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమికి షాక్ తగిలింది. జనసేనకు చెందిన పలువురు నేతలు ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు, నరేంద్రపురానికి చెందిన జనసేన నేత బోజా లక్ష్మీ శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నేతలు కరణం ధర్మశ్రీ,బొడ్డేడ ప్రసాద్,కోలా గురువులు వారిని పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు ఎంతోమంది ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి పాటుపడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్, పార్టీ నేతలు ఎ.వి. సత్యనారాయణ, జాజుల వెంకటరావు, దొడ్డి వరహా, బొడ్డేడ బుజ్జి, శంకరరావు, పొలమరశెట్టి సురేష్, ఎ.వి.సత్యనారాయణ, అల్లవరపు రమణ బాబు,, దొడ్డి సూరప్పారావు పాల్గొన్నారు.
జనసేన కోర్ కమిటీ సభ్యుడు వాసు రాజీనామా
మునగపాక: మండలంలోని నాగులాపల్లికి చెందిన జనసేన నేత కర్రి వాసు తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. వాసు జనసేన నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యునిగా చురుగ్గా పనిచేసేవారు. అయితే పార్టీలో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లేకపోవడం అలాగే నేర ప్రవృతి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడం వంటి అంశాలు తనకు నచ్చలేదన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ కూడా కార్యకర్తలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తాను మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరాల్సి వచ్చిందని, అయితే క్షేత్రస్థాయిలో సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీ నేతలు వ్యవహరించడం తనకు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ఆదివారం విలేకరులకు తెలిపారు.


