వైఎస్సార్సీపీ నేతతో పాటు సాక్షి విలేకరిపై అక్రమ కేసు పాత్రుని చెరువు రీసర్వే అడ్డగింపుపై 14 మందిపై కేసు అధికార పార్టీ అండతో పేట్రేగిపోతున్న కబ్జాదారులు కబ్జాను ప్రశ్నించిన కూటమి నాయకులపైనా కేసు
తుమ్మపాల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెంలోని పాత్రుని చెరువు వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల క్రితం చెరువు రికార్డుల ట్యాంపరింగ్‌పై జరిగిన ఆందోళనలో గ్రామస్తులు, కబ్జాదారుల మధ్య జరిగిన తోపులాటను ఆసరాగా చేసుకుని చెరువు కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రస్తుత జనసేన జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోల్నాటి అప్పారావు వివాదంపై వార్తలందించిన సాక్షి విలేకరితో పాటు రేబాక వైఎస్సార్సీపీ నేత మంత్రి సత్తిబాబు, తనకు గిట్టని పలువురు కూటమి నాయకులపైనా క్రిమినల్ కేసు నమోదు చేయించారు. గ్రామస్తుల ఆందోళన వార్తలు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, కబ్జాదారులు నుంచి నగదు డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై కోర్టు ద్వారా వచ్చిన ఆదేశాలతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. పాత్రుని చెరువు కబ్జాపై మొదటి నుంచి ‘సాక్షి’లో కబ్జాదారులపై కథనాలు ప్రచురించడంతో విలేకరిని కూడా కేసులో ఇరికించి భయాందోళనలకు గురిచేస్తున్నారు. గడిచిన జూన్ 29న చెరువు ఆందోళన జరగడం గ్రామస్తులు అదే రోజున అధికారులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి క్రమం తప్పకుండా సాక్షిలో వార్తలు ప్రచురితమయ్యాయి. పాత్రుని చెరువు కబ్జాపై ఆ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా ఆందోళనలు చేసి అధికారులకు ఫిర్యాదులు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులను పట్టించుకోకుండా ఆందోళన జరిగిన రెండు నెలల తర్వాత అంటే ఆగస్టు 25న ఎఫ్ఐఆర్ నెం.148/2026 నమోదు చేసి పలు సెక్షన్లు 111(2)(బి ),126(2),115(2),351(2) కింద రేబాక, కాపుశెట్టివానిపాలెం గ్రామాలకు చెందిన 14 మందిని ఎంపిక చేసి ఉద్దేశపూరితంగా కేసులో ఇరికించారు. ఇప్పుడు మరో రెండు నెలల తర్వాత ఎన్నికలు సమీపించిన వేళ వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి పోలీసులు వివరాలు అడగుతున్నారు. కేసులో ఇరుక్కున్న ప్రతి ఒక్కరు ష్యూరిటీగా మరో ఇద్దరి వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో భయాందోళనలకు గురవుతున్నారు.
కొందరినే లక్ష్యంగా చేసుకుని...
మరో పక్క ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో పోలీసులు రెండు గ్రామాల్లో తిరుగుతూ వివరాలు సేకరించడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీలో ఉంటునే చెరువును చెరబట్టాలనే దురుద్దేశంతో బడాబాబుల చేపట్టే ఆటలకు రేబాక, కాపుశెట్టివానిపాలెం గ్రామస్తులతో పాటు వైఎస్సార్సీపీ, కూటమి నాయకులు అడ్డుపుల్లగా తగలడంతో కేసులు ద్వారా భయపెట్టి పాత్రుని చెరువును చేజిక్కించుకోవడం కోసం పావులు కదుపుతున్నారు. వాస్తవానికి చెరువు ఆందోళనలో సుమారు 100 మందికి పైగానే గ్రామస్తులు చెరువు, కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టినప్పటికీ కేవలం కొందరిని మాత్రమే ఎంపిక చేసి కేసులు నమోదు చేయడంపై ఎన్నికల పన్నాగం కూడా ఉందని కూటమి నాయకులే అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసి ఎన్నికల్లో పోటీకి దూరం చేయాలనే ఆలోచనతోనే కేసు నమోదైందని పోటీకి సిద్ధపడిన కూటమి అభ్యర్థులు చెబుతున్నారు. చెరువు రికార్డుల ట్యాంపరింగ్, కబ్జాపై ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణతో పాటు సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కనీసం పట్టించుకోకుండా మౌనంగా ఉండి పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల మీనమేషాలెందుకు?
జలాధారంగా ఉన్న పాత్రుని చెరువు భౌతిక స్వరూపాన్ని ధ్వంసం చేయడం, రికార్డుల ట్యాంపరింగ్, నీటి నిల్వ, పారుదల నిలిపివేయడం వంటి అంశాలపై విచారణ చేసి కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు చెరువు వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కబ్జాదారుకు అండదండలా..?
చెరువు కబ్జాతో పార్టీ నుండి వెలేయాల్సింది పోయి జెడ్పీటీసీగా నామినేషన్ దాఖలు చేసినా పట్టించుకోని స్ధితిలో కూటమి అగ్ర నాయకత్వం ఉందని రెండు గ్రామాల కూటమి నాయకులే ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మరో కబ్జాదారు రేబాక జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అంటూ ప్రచారం రావడంతో జీర్ణించుకోలేని జనసేన, టీడీపీ నాయకులు నామినేషన్‌ను అడ్డుకొని తామే పోటీ చేస్తామంటూ ఎంపీటీసీ నామినేషన్ల చివరి రోజైన ఈనెల 23 మధ్యాహ్నం చివరి గడియల్లో ఆగమేఘాల మీద నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఇద్దరు జనసేన, ఒకరు టీడీపీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు.
పదేళ్ల కిందటే రికార్డుల తారుమారు..
వాస్తవానికి చెరువు భూ రికార్డులు తారుమారు వ్యవహారంపై 2016లో పెద్ద దుమారమే రేగింది. అప్పటి సర్పంచ్‌గా ఉన్న మంత్రి సత్తిబాబుతో పాటు గ్రామస్తులంతా అనకాపల్లి– ఆనందపురం జాతీయ రహదారిని స్తంభింపజేయడం, కబ్జాదారుల ఇళ్లను ముట్టడించడం, తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన భారీ ఆందోళనలతో రెవెన్యూ అధికారులు చెరువు రికార్డులను అప్పటిలోనే డిస్ప్యూట్గా చేర్చారు. నేటికీ డిస్ప్యూట్గా కొనసాగుతున్నప్పటికీ ఇటీవల రీసర్వేను ఆదునుగా చేసుకుని కబ్జాదారులు డిస్ప్యూట్ తొలగించి తమ పేర్లపై నమోదు చేసుకునేందుకు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క చెరువు సర్వేకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సర్వేను అడ్డుకుని అన్ని పార్టీల నేతలకు సమాచారం అందించడంతో అందరు కలిసి సర్వేను నిలిపివేశారు.


