అనకాపల్లి: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా ఈనెల 27న సాయంత్రం 3 గంటలకు, అదేరోజు అభ్యర్థుల గుర్తులను ప్రవేశపెట్టడం జరుగుతుందని జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణమూర్తి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల బీఫారం ముందుగా అందజేయాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల పోలింగ్ తేదీ నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు నవంబర్ 5న తెలియజేసి, అదేరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారితో గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 24 మండలాల్లో 24 జెడ్పీటీసీ, 427 ఎంపీటీసీ సెగ్మెంట్‌ల్లో 1530 పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు సంబంధించిన సమాగ్రిని ఇప్పటికే అందజేయడం జరిగిందన్నారు. పోలింగ్ సిబ్బందికి రెండో విడత ఈనెల 26న ఆయా మండల పరిధిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో 116 క్రిటికల్, 349 హైపర్, సెన్సిటివ్ 471, సాధారణ 594 మొత్తం పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. క్రిటికల్, హైపర్ పోలింగ్ కేంద్రాలు వద్ద గట్టి పోలీస్‌బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు ఓటువేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎంపీటీసీ అభ్యర్ధులకు ఎటువంటి సమస్యలు ఉన్న ఆర్డీవోకు, జెడ్పీటీసీకు సంబందించిన అభ్యర్ధులు కలెక్టర్‌కు తెలియజేయాలన్నారు.


