అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు | - | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

సీఎం రమేష్‌ మెప్పు కోసంప్రకటనలు సరికాదు

చోడవరం సుగర్స్‌ రైతుల బకాయిలు పట్టని కూటమి నేతలు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మునగపాక: చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీ రైతుల సమస్యలు పట్టని కూటమి నేతలు, నీతి నిజాయితీతో పనిచేస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్‌ వద్ద మెప్పు కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుడివాడ అమర్‌నాథ్‌ కుటుంబానికి ఎంతో రాజకీయ అనుభవం ఉందన్నారు. అమర్‌నాథ్‌ తండ్రి గురునాథరావు మంత్రిగా, పార్లమెంట్‌ సభ్యునిగా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలందించారని చెప్పారు. అలాంటి రాజకీయ నేపథ్యం కలిగిన గుడివాడను విమర్శించే హక్కు కూటమి నేతలైన ఎమ్మెల్యే రాజు, బత్తుల తాతయ్యబాబులకు లేదన్నారు. సుగర్‌ ఫ్యాక్టరీని నమ్ముకుని వేలాది మంది రైతు లు జీవనం సాగించేవారని, నేడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. సుగర్‌ ఫ్యాక్టరీ రైతులు నట్టేట మునిగిపోతున్నా పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మన ప్రాంత సంపదను దోపిడీ చేస్తుంటే స్పందించలేని వారు, అనకాపల్లి ఎంపీ రమేష్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్‌నాథ్‌ మాట్లాడితే హుందాగా ఖండించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం సరికాదన్నారు. పంచదార్ల కొండను అక్రమంగా తవ్వేసిన అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన చర్చపై సొంత పత్రికల్లో సైతం కథనం వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీ రమేష్‌ బంధువుల పేరిట లీజు రాయించుకున్న విషయం తెలిసిందేనన్నారు. అక్కడి స్థానికులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అక్రమ మైనింగ్‌ లీజును సైతం రద్దు చేసిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రే దీనిపై ట్వీట్‌ చేశారన్నారు. అంటే ఆరోపణలు నిజమేనని ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. ఈ విషయంలో అమాయక అధికారులను కూటమి ప్రభుత్వం బలి చేసిందని ఆరోపించారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గాల పరిధిలోని 25 వేల మంది రైతులకు నేటికీ బకాయిలు చెల్లించలేదని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. సుగర్‌ ఫ్యాక్టరీకి చెల్లించాల్సిన రూ.36 కోట్ల బకాయిలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినా రైతుల దుస్థితిపై ఎందుకు మాట్లాడలేదన్నారు. ఇప్పటికై నా మాజీ మంత్రి అమర్‌నాథ్‌పై వ్యక్తిగత ఆరోపణలు మానుకోవాలన్నారు. సవాల్‌ను ప్రతి సవాల్‌గా స్వీకరించాల్సింది పోయి వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. కూటమి నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే అమర్‌నాథ్‌తో పాటు తాను కూడా చోడవరంలో జరిగే వైఎస్సార్‌సీపీ సమావేశానికి వస్తానని చెప్పారు.విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు, మునగపాక మండల సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల నూకరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement