కశింకోట: వరి సాగు సమయం ముగింపు దశకు చేరుకున్నందున నీటి ఎద్దడి తట్టుకొనే ఆరు తడి పంటలు వేసుకోవాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సీహెచ్. లచ్చన్న రైతులకు సూచించారు. మండలంలోని సుందరయ్యపేట శివారు ఆనందపురంలో ప్రకృతి వ్యవసాయ భూములను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి సాగు గడువు ముగుస్తున్న సమయంలో నాట్లు వేసినా పంట గిట్టుబాటు కాదన్నారు. దీని దృష్ట్యా కంది, ఉలవలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, అండు కొర్రలు తదితర ఆరుడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే వరి వేసిన రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, చేప, బెల్లం ద్రావణంతోపాటు నత్రజని కోసం అజోల్ల నాలుగు కిలోల వంతున ఎకరానికి వేసినట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుందన్నారు. రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేయడం వల్ల కలిగే అనర్థాలను రైతులకు వివరించారు. మండలంలో 12 ప్రకృతి వనరుల కేంద్రాల నిర్వాహకులు, ఇన్‌ఫుట్ గ్రోత్ ప్రమోటర్లు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. రైతులకు కావలసిన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నా రు. ప్రకృతి వ్యవసాయం ఐసీటీ చిన్న, మార్కెటింగ్ ప్రతినిధి జ్యోతిర్మయి, డివిజన్ ఇన్‌చార్జి నూకరాజు, మండల ఇన్‌చార్జి సాయిరాం, సుందరయ్యపేట మండల ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకురాలు కూండ్రపు అరుణ పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్న


