ఉపమాకలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం, టీటీడీ అనుబంధ దేవాలయం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కల్కి అవతారంలో గరుడాద్రిపై స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి ప్రతి రోజు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు నిర్వహిస్తున్నారు. కొండ దిగువన క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామికి, అండాళ్లమ్మవారికి నిత్యార్చనలు, అభిషేకాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామ బలిహరణలు పూర్తిచేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆదివారం గరుడ వాహన సేవ, వసంతోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత దేవ దేవుడిని ఇత్తడి గరుడ వాహనంపై ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. గరుడ సేవకు ముందు సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామబలిహరణలు పూర్తిచేశారు.
నేత్రపర్వంగా వసంతోత్సవం
సాయంత్రం విశేష ఉత్సవంలో భాగంగా ఆస్థాన మండపంలో స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సప్తరుషి ఆవాహనం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఇత్తడి గరుడ వాహనంపై తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. స్వామివారి వెంట భక్తులు తరలి వెళ్లారు. వసంతోత్సవంలో భాగంగా పసుపు, కుంకుమ కలిపిన జలాలను భక్తులు ఒకరిపై ఒకరు జల్లుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాల్లో ప్రధానార్చకులు గొట్టు ముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, పి.వి.శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.


