అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా బాణసంచా తయారీ, విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం హెచ్చరించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అనుమతి పొందిన బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, తయారీ కేంద్రాల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు, నీరు, ఇసుక ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నా, అక్రమంగా నిల్వ ఉంచినా లేదా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని ఆయన కోరారు.


