మత్తు వదిలింది..దారి మారింది! | - | Sakshi
Sakshi News home page

మత్తు వదిలింది..దారి మారింది!

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

గిరిజనుల్లో విప్లవాత్మక మార్పు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలే కారణం

గంజాయి వీడి కాఫీ, రాజ్‌మా వైపు మొగ్గు

కొయ్యూరు: ఒకప్పుడు గంజాయి సాగుకు నిలయంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం నేడు దానికి క్రమంగా దూరమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడంతో నేడు గిరిజనులు ఎవరూ కూడా గంజాయి సాగు చేయడం లేదు. అప్పట్లో నేరుగా పోలీసులే రంగంలోకి దిగి వందలాది ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. సాగు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని పోలీసులు చేసిన హెచ్చరికలతో గంజాయి పెంపకానికి అడ్డుకట్ట పడింది. కాగా, మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా పోలీసులు డ్రోన్ల ద్వారా ఏరియల్‌ సర్వేలు నిర్వహిస్తున్నారు.

– ఒకప్పుడు కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీలోని అనేక గ్రామాలు గంజాయి సాగుకు, తరలింపునకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గిరిజనుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి తరలించేవారు. అయితే ఇటీవల పోలీసుల దాడులు, నిఘా పెరగడంతో గంజాయి రవాణా చాలావరకు నిలిచిపోయింది. ఒడిశా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని సైతం పోలీసులు తరచూ పట్టుకుంటున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో..

మారుమూల గ్రామాల్లో గంజాయి సాగును నిర్ధారించేందుకు డ్రోన్ల ద్వారా ఏరియల్‌ సర్వేలు చేపడుతున్నారు. కొయ్యూరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి, జి.మాడుగులతో పాటు ఇతర సరిహద్దు మండలాల్లో ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ డ్రోన్ల ద్వారా వచ్చిన చిత్రాలను పరిశీలించగా ఎక్కడా గంజాయి సాగు కావడం లేదని పోలీసులు నిర్ధారించారు.

వాణిజ్య పంటల వైపు గిరిజనుల మొగ్గు

గడిచిన మూడేళ్లుగా గిరిజన రైతులు గంజాయి సాగును పూర్తిగా వీడి వాణిజ్య పంటలపై దృష్టి సారించారు. బూదరాళ్ల పంచాయతీ పరిధిలో కాఫీ సాగు విస్తీర్ణం పెరిగింది. కొయ్యూరు మండలంలో వాతావరణం అంతగా అనుకూలించకపోవడంతో కాఫీ సాగు తక్కువగా ఉన్నప్పటికీ.. అపరాలు, చోడి, సామ, రాజ్‌మా వంటి ప్రత్యామ్నాయ పంటలను గిరిజనులు అధికంగా పండిస్తున్నారు. దీనివల్ల వారికి సక్రమ మార్గంలో మంచి ఆదాయం సమకూరుతోంది. మరోవైపు ఆపరేషన్‌ వజ్రప్రహార్‌లో భాగంగా పోలీసులు కూడా గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు.

మన్యంలో మత్తు వదిలింది.. సీన్‌ పూర్తిగా రివర్స్‌ అయింది! ఒకప్పుడు గంజాయి సాగుకు కేంద్రంగా ఉన్న కొయ్యూరు ప్రాంతం నేడు పచ్చని ప్రత్యామ్నాయ పంటలతో కళకళలాడుతోంది. డ్రోన్‌ కెమెరాలతో ఏరియల్‌ సర్వేలు చేసినా గంజాయి మొక్క కూడా దొరకనంతగా ఏజెన్సీ వాసులు మార్పు బాట పట్టారు. కష్టించి పండించే కాఫీ, రాజ్‌మా పంటలతోనే తమకు నిజమైన సిరులు కురుస్తున్నాయని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement