రూ.1.60 కోట్లకు కల్యాణ మండపం చేజిక్కించుకున్న కాంట్రాక్టర్
16 నెలలు గడిచినా చెల్లించింది రూ.45 లక్షలే
తొలి ఏడాదిలో చెల్లించాల్సిన రూ.80 లక్షల్లో ఇంకా రూ.35 లక్షల బకాయి
టెండర్ నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు శూన్యం
అధికార పార్టీ నేతలఅండదండలతోనే జాప్యమంటున్న స్థానికులు
పెదవాల్తేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, విశాఖలో ప్రసిద్ధి చెందిన పెదవాల్తేరు కరక చెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయ ఆదాయంపై వివాదం నెలకొంది. ఆలయానికి ప్రధాన ఆదాయ వనరైన కల్యాణ మండపం టెండర్‌దారుడు నిబంధనల మేరకు సొమ్ము చెల్లించకుండానే మండపాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రూ.1.60 కోట్లకు టెండర్..
చెల్లించింది రూ.45 లక్షలే
దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని పోలమాంబ ఆలయ కల్యాణ మండపానికి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతో పాటు ఎగ్జిబిషన్లు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు డిమాండ్ ఉంది. మండపం నిర్వహణకు ప్రతి రెండేళ్లకోసారి బహిరంగ వేలం నిర్వహిస్తారు. 2025 జూన్‌లో జరిగిన వేలంలో శ్రీనివాస్ అనే వ్యక్తి రెండేళ్ల కాలానికి రూ.1.60 కోట్లకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. జీఎస్టీతో కలిపి ఈ మొత్తం సుమారు రూ.1.89 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం తొలి ఏడాదిలో మొత్తం టెండర్ విలువలో 50 శాతం, అంటే రూ.80 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగతా మొత్తాన్ని రెండో ఏడాదిలో చెల్లించాలి. అయితే 16 నెలలు గడిచినా ఇప్పటివరకు రూ.45 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది.
4 నెలల సొమ్ము ఎగ్గొట్టే ఎత్తుగడ?
బకాయిలు చెల్లించాలని అధికారులు నోటీసులు పంపించారు. దీంతో టెండర్‌దారుడు తనకు నష్టం వచ్చిందని, తెలియక ఎక్కువగా వేలంపాట పాడానని, ఏడాది లీజు చెల్లించి తప్పుకుంటానని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ నేతలు కూడా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 16 నెలలపాటు మండపాన్ని వినియోగించుకుని 12 నెలలకు చెల్లిస్తే ఆలయ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెరవెనుక టీడీపీ నేతలు
సాధారణంగా టెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే నోటీసులు ఇచ్చి టెండర్ రద్దు చేయాలి. కానీ 4 నెలలుగా గడువు దాటినా దేవదాయ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది అధికార టీడీపీ నాయకుల హస్తం ఉందని, వారి అండదండలతోనే లీజు మొత్తాన్ని చెల్లించడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఆలయ ఆదాయానికి నష్టం వాటిల్లకుండా పెండింగ్ బకాయిలు వడ్డీతో సహా వసూలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
అక్టోబరు నాటికి ఏడాది బకాయి చెల్లిస్తానన్నారు
టెండర్‌కు సంబంధించి ఏడాది కాలానికి చెల్లించాల్సిన బకాయి సొమ్ము చెల్లించాలని శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చాం. దీనిపై శ్రీనివాస్ స్పందిస్తూ.. అక్టోబరు నాటికి ఏడాది కాలం బకాయిలు చెల్లిస్తానని రాతపూర్వకంగా చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం
–రాజగోపాల్‌రెడ్డి, ఈవో, పోలమాంబ దేవాలయం


