లాంగ్‌ రైడ్‌ విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

లాంగ్‌ రైడ్‌ విషాదాంతం

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

రేగుపాలెం హైవే కూడలి వద్ద ప్రమాదం

లారీ వెనుక చక్రాల కిందకు దూసుకుపోయిన బైక్‌

సంఘటన స్థలంలో యువ వ్యాపారి దుర్మరణం

యలమంచిలి రూరల్‌: అంతవరకూ ఆనందంగా... స్నేహితుల కోలాహలంతో సాగుతున్న ప్రయాణంలో అంతలోనే విషాదం అలుముకుంది. వారాంతంలో సరదాగా స్నేహితులతో కలిసి విశాఖపట్నం నుంచి ప్రకాశం జిల్లా చీరాల బీచ్‌కు లాంగ్‌ రైడ్‌కు వెళ్లిన యువ వ్యాపారి తిరుగు ప్రయాణంలో విశాఖకు వస్తుండగా యలమంచిలి మండలం రేగుపాలెం హైవే కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దీంతో స్నేహితులు, మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, స్థానికుల కథనం మేరకు... విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతానికి చెందిన దుస్తుల వ్యాపారి పురిపండ నాగ దంతేశ్వర రావు(34).. వీకెండ్‌ కావడంతో తన స్నేహితులు జోసెఫ్‌, మాథ్యూ, రితేష్‌ , మరికొందరితో కలిసి స్పోర్ట్స్‌ బైక్‌లపై లాంగ్‌ రైడ్‌కు చీరాల బీచ్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన అనంతరం తిరిగి విశాఖపట్నం ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం రేగుపాలెం హైవే కూడలి సమీపానికి వచ్చేసరికి దంతేశ్వరరావు తన ద్విచక్ర వాహనాన్ని ముందు వెళ్తున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్‌ చేయడానికి ప్రయత్నించాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ వెనుక చక్రాల కిందకు దూసుకుపోయింది. దంతేశ్వరరావు శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అతని శరీర భాగాలు పూర్తిగా నుజ్జు కావడంతో చూసిన వారంతా భయాందోళనకు గురయ్యారు. మరో గంటన్నరలో ఇంటికి చేరుకోవాల్సిన దంతేశ్వరరావు లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. సరదా కోసం మొదలైన ప్రయాణం రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో విషాదాంతమైంది. ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, యలమంచిలి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర, సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని లారీ చక్రాల కింద చిక్కుకుపోయిన ద్విచక్రవాహనాన్ని, మృతదేహాన్ని పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. మృతదేహాన్ని అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు నవీన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement