జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశమిచ్చిన మాజీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
జీవితాంతం ఆయనను గుర్తుంచుకుంటానని భావోద్వేగం
160 మందికి కారుణ్య నియామకాలు.. 195 మందికి పదోన్నతులు
ఆత్మీయ సత్కార సభలో జల్లిపల్లి సుభద్ర
మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా నిజాయితీగా పనిచేశానని, ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారబోతున్నానని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆమెకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు కల్పించిన అవకాశాన్ని ఐదేళ్లపాటు సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని తనకు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డిని జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి గురయ్యారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒత్తిళ్లకు లొంగకుండా..
చైర్‌పర్సన్‌గా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. జిల్లా అధిపతిగా కాకుండా ఉత్తమ అధికారిలా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు సాగానన్నారు. అందుకే జెడ్పీ ఉద్యోగులంతా తన కుటుంబ సభ్యులుగా మారారని పేర్కొన్నారు. కోవిడ్ తదితర కారణాలతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు చెందిన 160 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించామన్నారు. తన హయాంలో వివిధ స్థాయిల్లో 195 మందికి పదోన్నతులు కల్పించగలిగామని, కష్టాల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచినందుకు సంతృప్తిగా ఉందన్నారు.
పాలనాదక్షతకు చైర్‌పర్సన్ నిదర్శనం
జెడ్పీ సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ.. పాలనా దక్షత, నిబద్ధతకు చైర్‌పర్సన్ సుభద్ర నిదర్శనమన్నారు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా చూసుకుంటూనే రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. జెడ్పీ చరిత్రలోనే ఉద్యోగులంతా సంతోషంగా గడిపిన కాలం చైర్‌పర్సన్ సుభద్ర హయాంలోనేనన్నారు. ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఈవో రాజకుమార్, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తిబాబు తదితరులు సుభద్ర సేవలను కొనియాడారు. అనంతరం జల్లిపల్లి సుభద్ర–మూర్తి దంపతులను ఉద్యోగులు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీడీవో ఉషారాణి, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ జిల్లా అధికారి సత్యనారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి సీతారామరాజు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సోనాయి అప్పలరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.


