చింతపల్లి: గిరిజన రైతుల అనుమతి లేకుండా, వారు సాగు చేసుకుంటున్న 30 ఎకరాల భూమిని కుంకుమ పువ్వు ప్రాజెక్టుకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి తెలిపారు. ఆదివారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని చెరువీధి గ్రామంలో ఆదివాసీ రైతులతో కలసి ఆయన నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా ఈ గ్రామానికి చెందిన 23 ఆదివాసీ కుటుంబాలు ఐటీడీఏకు చెందిన భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిలో 20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు, మరో 10 ఎకరాల్లో కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నారని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ భూమిని కుంకుమ పువ్వు ప్రాజెక్టుకు కేటాయించడం వల్ల పేద గిరిజన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పీసా కమిటీ తీర్మానంపై ఆగ్రహం
గ్రామానికి చెందిన గిరిజన రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, మండల పీసా కమిటీ ఏకపక్షంగా తీర్మానం చేసి అధికారులకు నివేదిక ఇవ్వడాన్ని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారని చిరంజీవి మండిపడ్డారు. సాగు చేసుకుంటున్న రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఈ భూ కేటాయింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం ముందుకెళ్తే గిరిజనులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ కార్యదర్శి జి. అప్పారావు, గిరిజన సంఘం నాయకులు అప్పాలస్వామి, చిరంజీవి, రైతులు గురు, బలరాం, సొన్నుదొర, వంతల సైత్, సూరిబాబు, రాజుబాబు, గాసిరాం, సత్యబాబు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


