ఏడు రోజుల గడువుతో కంటితుడుపు చర్యలు
పార్టీలకతీతంగా అర్హులైన అందరికీ అవకాశం కల్పించాలి
టీడీపీ నాయకుల చుట్టూ కొత్త పెన్షన్ దారులను తిప్పుకోవడం సరికాదు
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి దగా పాలన సాగిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖలోని మద్దిలపాలెంలో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత స్థానిక ఎన్నికల దృష్ట్యా ఏడు రోజుల పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్ల తరువాత కొత్త పెన్షన్లు ఇస్తూ..అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. అర్హులైన వారందరికీ అవకాశం దక్కేలా దరఖాస్తు గడువును మరిన్ని రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకుల చుట్టూ కొత్త పెన్షన్ దారులను తిప్పుకుంటున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఎండిపోయిన నారుమళ్లు.. కరువు విలయతాండవం
చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. వర్షాలు పడక నారుమళ్లు ఎండిపోతుంటే రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే, ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికలకు ముందు ధరలను అదుపు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ పాలనే స్వర్ణయుగం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించామని ముత్యాలనాయుడు పేర్కొన్నారు. 2019–24 వరకు అర్హులైన వారు ఎప్పుడైనా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా పోర్టల్‌ను ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల గడప వద్దకే పాలన అందించామని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించామని, రైతులు సైతం ఆనందంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
మోసపూరిత హామీలు.. 6.20 లక్షల పింఛన్ల తొలగింపు
కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారని, కానీ గత 26 నెలలుగా కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదని ముత్యాలనాయుడు నిలదీశారు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 6,20,000 మంది పేదల పింఛన్లను దారుణంగా తొలగించారని మండిపడ్డారు. వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు మంజూరు చేశారని, ఐదేళ్ల కాలంలో 10 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, ’ఇంటికొక ఉద్యోగం’, ’నిరుద్యోగ భభృతి నెలకు రూ. 3,000’, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ’ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన చంద్రబాబు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


