ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసిన స్కూల్ బెంచీలను ఎల్‌అండ్ టీ కంపెనీకి మంగళవారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సీఎస్‌ఆర్ నిధులతో బెంచీలను తయారు చేయించేందుకు ఎల్‌అండ్‌టీ కంపెనీ జైలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భాగంగా డస్క్‌లతో కూడిన 100 స్కూల్ బెంచీలను సిద్ధం చేసి, ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన వ్యానులో జైలు అధికారులు మంగళవారం పంపించారు. ప్రస్తుతం పంపిస్తున్న ఈ 100 బెంచీలను మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్‌అండ్‌టీ కంపెనీ నుంచి ఇటీవల 400 స్కూల్ బెంచీల తయారీకి ఇండెంట్ వచ్చిందన్నారు. విడతల వారీగా 100 బెంచీల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఒక విడత బెంచీలను పంపించామని, మరో మూడు విడతల్లో మిగిలిన బెంచీలను అందజేస్తామని పేర్కొన్నారు. జైలులోని ఖైదీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చే కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి జైళ్లకు ఆర్డర్లు ఇచ్చేందుకు సహకరించాలని ఆయన కోరారు.


