ముగిసిన ‘సర్’ ప్రక్రియ 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అనకాపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జాబితాలో దాదాపు 1,08,606 ఓట్లు తొలగించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇది ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమమే అయినప్పటికీ, అమలవుతున్న తీరుపై రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. జిల్లాలో ప్రస్తుతం 13,02,389 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారం–2లను పంపిణీ చేయగా, 11,93,783 ఫారాలను డిజిటలైజ్ చేశారు. అంటే 91.66 శాతం ప్రక్రియ పూర్తయింది. కాగా శుక్రవారంతో ఫారాల సమర్పణ ముగిసింది. 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు యాడెడ్, షిఫ్టెడ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఎక్కువ ఆందోళన షిఫ్టెడ్ ఓట్లపైనే..
తొలగించిన ఒక లక్షా 8 వేల 606 ఓట్లలో అత్యధికంగా మరణించిన వారు 48,455 మంది ఉండగా, 32,609 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 21,608 ఓట్లు, చోడవరం నియోజకవర్గంలో 19,467, అత్యల్పంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 16,709 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగించిన వాటిలో షిఫ్టెడ్ ఓట్లు ఎక్కువగా పాయకరావుపేట నియోజకవర్గంలో 6,946 ఉండగా, తర్వాత స్థానంలో చోడవరం నియోజకవర్గంలో 6,564, యలమంచిలి నియోజకవర్గంలో 6,243 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా డబుల్ ఎంట్రీ.. అనకాపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 3,692 ఓట్లు, తర్వాత యలమంచిలిలో 2,780 ఓట్లు ఉన్నాయి. సర్ ప్రక్రియలో శాశ్వత నివాసాన్ని నిర్ధారించే సమయంలో వీరిలో చాలా మంది పేర్లు తొలగించారని తెలుస్తోంది.
మ్యాపింగ్‌పై ఆరోపణలు
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు నిర్వహించిన మ్యాపింగ్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తొందరపాటు, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్ల వివరాలు సరిగా నమోదు కాలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒకే నియోజకవర్గంలో బూత్ మారిన కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు, వివాహం తర్వాత చిరునామా మారిన మహిళలు, ఉద్యోగరీత్యా బదిలీ అయిన వారు, అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాల వివరాలు మ్యాపింగ్‌లో సరిగా నమోదు కాలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం.. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు అధికారికంగా స్పందించలేదు.
అసెంబ్లీ మొత్తం ఓటర్లు డిస్ట్రిబ్యూటెడ్ డిజిటలైజేషన్ శాతం
చోడవరం 2,19,895 2,19,895 2,00,428 91.14
మాడుగుల 1,90,545 190,545 1,76,516 92.63
అనకాపల్లి 2,15,615 215,615 1,96,945 91.34
యలమంచిలి 2,08,851 2,08,851 1,90,728 91.32
పాయకరావుపేట 2,53,393 2,53,393 2,31,785 91.47
నర్సీపట్నం 2,14,090 2,14,090 1,97,381 92.19
మొత్తం 13,02,389 13,02,389 11,93,783 91.66
జిల్లాలో అసెంబ్లీ వారీగా డిజిటలైజేషన్


