నక్కపల్లి: ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) పర్వదినం సందర్భంగా మండలంలోని ఉపమాక గ్రామంలో గరుడాద్రిపై వేంచేసియున్న కల్కి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజ లు నిర్వహించనున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ గాలిగోపురం వద్ద విశాలమైన ప్రాంగణంలోనూ, ఆలయంలోనూ క్యూలైన్లు, స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందజేయడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. తెల్లవారుజామున 3:30 గంటలకు కల్కి వేంకటేశ్వర స్వామివారి మూలవిరాట్‌కు విశేష అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు భక్తులందరికీ దర్శనం కల్పిస్తారు. కొండ దిగువన గల ఆలయ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారి ఆలయంలోనూ నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించిన తర్వాత రాత్రి 8 గంటల వరకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక శ్రీనివాస భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తుల గోవింద నామస్మరణ మధ్య గిరిప్రదక్షిణ జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు.
ఉపమాక ఆలయంలో
ప్రత్యేక ఏర్పాట్లు


