‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి

Jul 13 2026 12:40 AM | Updated on Jul 13 2026 12:40 AM

ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి

ఐటీడీపీ కుట్రలపై కన్నేసి ఉంచండి

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

నక్కపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్‌)కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌ సూచించారు. ఆదివారం ఆయన భీమవరం వెళ్తూ నక్కపల్లిలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో మాట్లాడుతూ స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ రివిజన్‌పేరుతో భారీగా ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని చెప్పారు. ఎన్నికల సంఘం నిర్వహించే ఈ సర్వేలో అధికార టీడీపీ దొడ్డిదారిలో ఐటీడీపీ ద్వారా ప్రవేశిస్తోందన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్ల తొలగింపునకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇదే ఫార్ములా ఉపయోగించడం వల్ల అక్కడ అధికార పార్టీలు తమ అధికారాన్ని కోల్పోయాయని చెప్పారు. ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారుల ఓట్లను లక్షల్లో తొలగించడం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. నేరుగా ప్ర,జాస్వామ్య పద్ధతిలో విజయం సాధించే సత్తాలేని పార్టీలు ఈ విధంగా దొడ్డిదారిలో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ పార్టీల కుయుక్తులను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ తరఫున నియమించిన బీఎల్‌ఏలో ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రత్యేక సవరణ చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్‌ ఫారం అందించి, వాటిలో పూర్తి వివరాలు నమోదు చేసి, బీఎల్‌వోలకు అందించాలన్నారు. ఇలా అందించిన ఫారాల్లో అధికార పార్టీనాయకులు కుట్రలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈనెలలో 21 లేదా 24 తేదీల్లో తుది జాబితాలు ప్రకటిస్తారని, తుదిజాబితాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు ఉన్నాయా, గల్లంతయ్యాయా అనేది పరిశీలించాలన్నారు. తుది జాబితాలో అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. గల్లంతయిన ఓట్లను తిరిగి నమోదు చేసేందుకు తగిన ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని చెప్పారు. కొత్త ఓట్లకోసం దరఖాస్తులను అందజేయాలన్నారు. ప్రతి ఓటు కీలకమని కాపాడుకునే బాధ్యత బీఎల్‌ఏలదేనని తెలిపారు. ఈ ఓటర్ల జాబితా సవరణ విషయంలో బీఎల్‌ఏలకు గ్రామ,మండల స్థాయి నాయకులు సహకరించాలని, ఏమైనా తప్పొప్పులు జరిగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఆక్వా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం వస్తున్నందున ఆయనకు మద్దతుగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పలువురు పార్టీ నేతలు తరలివెళుతున్నట్టు తెలిపారు. వై.ఎస్‌. జగన్‌.. భీమవరం పర్యటన అడ్డుకునే కుట్రలో భాగంగా హెలీకాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతి లేదంటూ ప్రచారం జరుగుతోందని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం జగనన్న తప్పకుండా వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌, యలమంచిలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, నియోజకవర్గ వాణిజ్యవిభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, పార్టీనాయకులు అల్లాడ కొండ, మైలపల్లి సూరిబాబు, పిక్కి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement