భారీ విపత్తు రాకుండా ఉండేందుకు స్వల్ప ప్రకంపనలు దోహదం భౌగోళికంగా సిస్మిక్–2 జోన్‌లో విశాఖ టెక్టోనిక్ ప్లేట్ల సర్దుబాటు క్రమంలో శక్తి విడుదలై ప్రకంపనలు దఫదఫాలుగా భూగర్భంలో ఒత్తిడి విడుదల
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర వాసులను ఆదివారం తెల్లవారుజామున ఉలిక్కిపడేలా చేసిన భూప్రకంపనలు.. ఒకరకంగా మన మంచికేనా..? అంటే భౌగోళిక శాస్త్రవేత్తలు అవుననే సమాధానమిస్తున్నారు. ఉన్నట్టుండి మంచాలు కదలడం, వస్తువులు కింద పడటం, భవనాలు ఊగడం లాంటి పరిణామాలు సామాన్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేసినప్పటికీ.. శాసీ్త్రయంగా విశ్లేషిస్తే ఇదొక ప్రకృతి సహజమైన ‘సేఫ్టీ వాల్వ్’ప్రక్రియ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం భౌగోళికంగా అత్యంత సురక్షితమైన ‘సిస్మిక్ జోన్–2’(అతి తక్కువ భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతం) పరిధిలో ఉంది. భూగర్భంలో టెక్టోనిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ సర్దుబాటు చేసుకునే క్రమంలో విపరీతమైన ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి లోపల పొరల్లో ఇరుక్కుపోకుండా, ఇలా దఫదఫాలుగా చిన్నపాటి తరంగాల రూపంలో బయటకు విడుదల కావడం వల్ల.. భవిష్యత్తులో అది ఒకేసారి పెను విపత్తుగా మారే ముప్పు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రెజర్ కుక్కర్‌లా.. ఒత్తిడి తగ్గుదల
భూమి లోపలి పొరల నిర్మాణాన్ని ఒక భారీ ప్రెజర్ కుక్కర్‌తో పోల్చవచ్చు. అందులో ఉష్ణోగ్రతల వల్ల నిరంతరం ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. కుక్కర్‌కు ఉన్న విజిల్ ద్వారా ఆవిరి కొద్దికొద్దిగా బయటకు పోతే ప్రమాదం ఉండదు. అదే విధంగా, భూమి లోపల టెక్టోనిక్ ప్లేట్ల మధ్య పెరిగిన ఒత్తిడి ఇలా 4.5 తీవ్రతతో(తాజా ప్రకంపనల తరహాలో) అప్పుడప్పుడూ బయటకు రావడం వల్ల శక్తి ఎప్పటికప్పుడు సమతుల్యం అవుతుంది. అలా కాకుండా ఏళ్ల తరబడి ఆ శక్తి లోపలే ఉండిపోతే.. ఒకేసారి 7 లేదా 8 తీవ్రతతో బద్దలై పెను భూకంపాలకు దారితీస్తుంది.
కోట్ల ఏళ్ల నాటి భౌగోళిక పగుళ్లే కేంద్రంగా..!
తాజాగా బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులోనే ప్రకంపనలు రావడానికి ఓ ఆసక్తికరమైన భౌగోళిక నేపథ్యం ఉంది. కోట్లాది సంవత్సరాల క్రితం గోండ్వానా ఖండం నుంచి భారత భూభాగం విడిపోతున్న సమయంలో.. భీమిలికి తూర్పున సముద్రంలో భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగాయి. కాలక్రమంలో ఆ అగ్నిపర్వతం చల్లబడి శిలలుగా మారినప్పటికీ, ఆ కఠినమైన పొరల మధ్య భారీ పగుళ్లు(ఫాల్ట్‌లైన్స్) ఏర్పడ్డాయి. ఇప్పుడు భూమి లోపల ఒత్తిడి పెరిగినప్పుడల్లా ఈ పాత పగుళ్ల వద్దనే సర్దుబాటు జరుగుతూ శక్తి విడుదలవుతోంది. సముద్ర గర్భంలో చాలా పైపొరల్లోనే ఈ పరిణామం జరగడం వల్ల తరంగాలు వేగంగా తీరాన్ని తాకుతున్నాయి.
గట్టి రాళ్ల నుంచి శరవేగంగా తరంగాలు
భూకంప కేంద్రం విశాఖకు దూరంగా బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ నగరంలో ప్రకంపనలు ఎందుకు వచ్చాయన్న సందేహం అందరిలోనూ ఉంది. దీనికి ప్రధాన కారణం.. విశాఖ నేల స్వభావం. తూర్పు కనుమలు, సముద్రం కలిసే ఈ ప్రాంతం ‘ఖోండలైట్’లాంటి అత్యంత కఠినమైన శిలలతో నిర్మితమై ఉంది. సముద్రంలో పుట్టిన తరంగాలు ఇసుక లేదా మట్టిలో ప్రయాణిస్తే త్వరగా శక్తిని కోల్పోతాయి. కానీ, ఇక్కడి కఠినమైన రాతి పొరల ద్వారా ఆ తరంగాలు ఏమాత్రం శక్తి కోల్పోకుండా శరవేగంగా ప్రయాణించి నేరుగా నగరంలోని ఎత్తైన ప్రాంతాలను బలంగా తాకాయి. ముఖ్యంగా.. ఎంవీపీ, సీతమ్మధార, ఆరిలోవ, మధురవాడ ప్రాంతాల్లో ఈ హార్డ్‌రాక్స్ ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో తీవ్రత కాస్తా ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే.. భూకంపాల పరంగా.. విశాఖ సేఫ్ జోన్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాకినాడ సమీప భూకంపానికి కారణమిదే..
విశాఖ విద్య: జాతీయ సముద్ర పరిశోధనా సంస్థ(ఎన్‌ఐవో) మాజీ శాస్త్రవేత్త డా.కె.ఎస్.ఆర్.మూర్తి మాట్లాడుతూ, తూర్పు తీరంలో పుదుచ్చేరి, ఒంగోలు, విజయనగరం తీర ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవించే బలహీన భూభాగాలు ఉన్నాయని తెలిపారు. వీటి తీవ్రత సాధారణంగా 4.5 కంటే తక్కువగా ఉంటుందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా తక్కువేనన్నారు. ఆదివారం నమోదైన భూకంపం సముద్రగర్భంలో, కాకినాడకు తూర్పున ఉన్న బలహీన భూభాగంలో అంతర్గత ఒత్తిడి కారణంగా సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతం గోదావరి డెల్టా సముద్ర పరిధిలోకి వస్తుందని, ఖచ్చితమైన కారణాలు నిర్ధారించాలంటే మరింత శాసీ్త్రయ అధ్యయనం అవసరమని పేర్కొన్నారు.


