నర్సీపట్నం: దోపిడీ చేయటంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెతారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన స్పీకర్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. దోపిడీలు గురించి మాట్లాడే అర్హత అయ్యన్నపాత్రుడుకి లేదని, లేటరైట్ తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. పక్క నియోజకవర్గం రోలుగుంట మండలంలోని రాయి క్వారీల ద్వారా ఏపీ టాక్స్ (అయ్యన్నపాత్రుడు)పేరుతో కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విధంగా దోచుకుంటూ దోపిడీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వ్యక్తులపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ రూ.10 లక్షల ఖర్చు నిగ్గు తేల్చండి...
నూకాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సీఎంఆర్ అధినేత ఇచ్చిన రూ.10 లక్షలపై సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని జైల్లో వేయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీ ఎమ్మెల్యే గణేష్ సవాల్ విసిరారు. నిధులు కాజేశారని పదే పదే తనపై విమర్శలు చేయడం తగదన్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు మూడు నెలలు ఉండగా, అయ్యన్నపాత్రుడు ఇక్కడ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు డిపాజిట్ చేయడం వాస్తవమేనని, అప్పట్లో శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో అప్పటి సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆలయ నిర్మాణానికి రూ.44.38 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. ఆ నిధులతో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయాన్ని నిర్మించానన్నారు. ఆరేళ్ల క్రితమే ఆలయం నిర్మాణం చేశానని స్పీకర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆరేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో గొయ్యి ఉందన్న వాస్తవాలను ప్రజలు కూడా గ్రహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఆలయాన్ని వినియోగంలోకి తీసుకురావడాన్ని అభినందిస్తున్నామన్నారు. అమ్మవారి విగ్రహం తయారీకి రూ.1.50 లక్షలు అవుతుంటే, అప్పుడే శిల్పికి రూ.లక్ష ఇచ్చానని, ఆ విగ్రహాన్ని స్పీకర్ పెట్టనివ్వలేదన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో సీఎంఆర్ అధినేతను ఆర్థిక సాయం కోరామన్నారు. అప్పటి ఆలయ చైర్మన్ ధనిమిరెడ్డి నాగు ఈ నిధులను ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. ఈ నిధులు మాజీ ఎమ్మెల్యే తినేశారని అబద్ధాలు చెప్పడం తగదన్నారు. అమ్మవారి పేరుతో డబ్బులు దండుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. స్పీకర్ హోదాలో రూ.10 లక్షలపై సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని జైల్లో వేయించాలని సవాల్ విసిరారు. ఇకనైనా నిరాధార ఆరోపణలతో తనపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ తదితరులు పాల్గొన్నారు.


