ప్రాథమిక విద్య బలోపేతంతో సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక విద్య బలోపేతంతో సత్ఫలితాలు

Mar 13 2026 7:51 AM | Updated on Mar 13 2026 7:51 AM

● విశాఖ ఆర్జేడీ విజయ భాస్కర్‌

కశింకోట: పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని గుర్తించి పాఠశాల స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించుకొని అమలుకు కృషి చేయాలని విశాఖపట్నం రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విజయ భాస్కర్‌ ఉపాధ్యాయులకు సూచించారు. కశింకోటలోని డీపీఎన్‌ జెడ్పీ హైస్కూలులో జిల్లాలోని 24 మండలాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ కార్యక్రమంపై రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి విద్యను బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు సాధించడానికి దోహదంగా నిలుస్తాయన్నారు. దీనికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, అప్పుడే విజయాలు సాధించవచ్చునన్నారు. పరాక్‌ రాష్ట్రీయ సర్వేక్షన్‌ 2024 కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా చేపట్టారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ యాజమాన్యాలకు సంబంధించిన 84 పాఠశాలల్లో 3,6,9 తరగతులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దీని ఫలితాలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వివిధ రకాల అంశాలపై వ్యత్యాసాలు, వాటి కారణాలు, అభివృద్ధి పరచుకోవడానికి తీసుకోవలసిన చర్యలను మండలాల్లో అమలు చేయాలన్నారు. దీనిలో విద్యా శాఖ అధికారులు, క్లస్టర్‌ హెచ్‌ఎంలు, ఎస్జీటీల, పాఠశాల సహాయకులు కలిపి సమూహంగా ఏర్పడి కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం అమలుపై అవగాహనకు శిక్షణ నిర్వహించామన్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు మాట్లాడుతూ సంగ్రహణాత్మక అభివృద్ధి నివేదిక నింపడం ద్వారా పిల్లల్లో ఒక ప్రేరణ కలిగించవచ్చునన్నారు. ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడానికి ఈ నివేదికలు దోహదపడతాయన్నారు. యలమంచిలి ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు, హెచ్‌ఎం ప్రసాద్‌ మాట్లాడారు. భీమిలి డైట్‌ ఉపన్యాసకులు అల్లావుద్దీన్‌, డీసీసీబీ కార్యదర్శి సత్యనారాయణ, రిసోర్స్‌ పర్సన్లు ఏవీ రాజగోపాల్‌, రాము శిక్షణ ఇచ్చారు. అనంతరం స్థానిక హైస్కూలులో టెన్త్‌ విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయమై సూచనలిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement