వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై 21న రాష్ట్రస్థాయి సెమినార్
చోడవరం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరశిస్తూ ఈనెల 21వ తేదీన చేపట్టిన రాష్ట్ర స్థాయి సెమినార్‌ను విజయవంతం చేయాలని పీడీఎస్‌ఓ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నందారపు భాస్కరరావు కోరారు. విజయవాడలో జరగనున్న సెమినార్‌ను విజయవంతం చేయాలని కోరుతూ చోడవరంలో ప్రచార వాల్‌పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేదుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిని విద్యార్థులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 21వ తేదీన విజయవాడలో విద్యార్థులతో భారీ సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్‌ను జయప్రదం చేయడానికి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్ధులు, యువకులు తరలి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌ఓ నాయకులు ఎల్.వరహాలనాయుడు, బి.కుమార్, వై.యశ్వంత్, ఎన్.తరుణ్ పాల్గొన్నారు.


