
సేఫ్ స్టే యాప్‌కు చిక్కిన గంజాయి నిందితుడు
రోలుగుంట/నర్సీపట్నం: సేఫ్ స్టే యాప్ ద్వారా గంజాయి నిందితుడు పోలీసులకు చిక్కాడు. నర్సీపట్నం టౌన్ సీఐ జి.గోవిందరావు, రోలుగుంట ఎస్సై రామకృష్ణారావు అందించిన వివరాలు.. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు హోటల్స్, లాడ్జిల్లో సేఫ్ స్టే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించారు. వారికి కేటాయించిన లాగిన్ ఐడీలో హోటల్స్, లాడ్జిలకు వచ్చే వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ యాప్‌లో వివరాలు జిల్లా ఐటీ కోర్ టీమ్‌కు వెళ్తాయి. అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, బచ్చింత గ్రామానికి చెందిన గెమ్మెలి చిన్నారావు రోలుగుంట పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన గంజాయి కేసులో నిందితుడుగా ఉన్నాడు. మంగళవారం నిందితుడు నర్సీపట్నం పాలిమర్ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అతని వివరాలు యాప్‌లో నమోదు కావడంతో ఐటీ కోర్ టీమ్ అప్రమత్తమైంది. అతడు గంజాయి కేసులో తప్పించుకొని తిరుగుతున్న నిందితుడని గుర్తించి, ఆ సమాచారం పోలీసులకు చేరవేసింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, రోలుగుంట పోలీసులకు అప్పగించామని సీఐ గోవిందరావు తెలిపారు. రోలుగుంటలో ఎస్సై పి.రామకృష్ణారావు నిందితుడిని ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో 78 కేజీల గంజాయితో దొరికిన ముగ్గురిలో అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేయగా, మూడో నిందితుడు చిన్నారావు పరారీలో ఉన్నాడని, యాప్ వల్ల ఇన్నాళ్లకు చిక్కాడని వివరించారు.