
ప్రభుత్వ వైఫల్యం వల్లనే విద్యార్థినిపై లైంగికదాడి
నర్సీపట్నం: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధినిపై లెక్చరర్ శ్రీధర్ పాల్పడిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్, బాలాజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా చట్టాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే ఇటువంటి లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనకు కారణమైన లెక్చరర్ జి.శ్రీధర్‌ని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న కాలేజీలోనే ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. లైంగికదాడి జరిగి మూడు రోజులైనా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధితురాలు మైనర్ బాలిక కాబట్టి ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి పోక్సో చట్టం ప్రకారం శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపకార్యదర్శి గౌతం,జిల్లా గర్‌ల్స్ కన్వీనర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.