
జీడి పిక్కల గొడౌన్ల ఆకస్మిక తనిఖీలు
రూ.23వేలపైగా జరిమానా
నాతవరం: జీడిపిక్కలు గొడౌన్లపై రెండో రోజు కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మర్రిపా లెం పంచాయతీ శివారు మోక్లాంగులపాలెం, వల్సంపేట పంచాయతీ లో మంగళవారం నర్సీపట్నం మా ర్కెట్ కమిటీ కార్యదర్శి భువనేశ్వరి ఆధ్వర్యంలో రెవె న్యూ పోలీసు అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి భువనేశ్వరి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నాతవరం మండలంలో రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో జీడి పిక్కలు గొడౌన్లపై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. మంగళవారం నిర్వహించిన దాడిలో మోక్లాంగులపాలెంలో మార్కెట్ పన్ను చెల్లించని 20 క్వింటాళ్లపైగా జీడి పిక్కలు దొరికాయన్నారు. నిబంధనల మేరకు మార్కెట్ పన్నులు రూ. 23వేలకు పైగా జరిమానా విధించామన్నారు. ఇక మీదట నియోజకవర్గం నాలుగు మండలాల్లో దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వ్యాపారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.