
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాల స్వీకరణ
తుమ్మపాల: ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై అభ్యంతరాలు, పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యన్నారాయణరావు రాజకీయ పార్టీల నేతలకు సూచించారు. ఓటర్ జాబితాపై నెలవారి సమావేశాల్లో భాగంగా కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు కొత్తగా ఓటరు నమోదు కొరకు, ఓటురు తొలగింపునకు, ఓటరు ఐడీ కార్డు సవరణల కోసం 1,354 దరఖాస్తులు నమోదయ్యాయన్నారు. వీటిలో 820 దరఖాస్తులు పరిష్కరించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని డీఆర్వో రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు, పరస్పర అనుకూలమైన సలహాలు, సూచనలు అందించేందుకు రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు వాసునాయుడు, అగ్నిమాపక స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (అనకాపల్లి), పి.నాగేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, కె.హరినాధబాబు, జి.గున్నబాబు, తుట్టా రమణ, పి.దుర్గారావు, గంటా సూరిబాబు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.