
కొక్కిరాపల్లిని డీ నోటిఫై చేయాలని కౌన్సిలర్ దీక్ష
యలమంచిలి రూరల్: కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1378 ప్రకారం కొక్కిరాపల్లి గ్రామాన్ని యలమంచిలి మున్సిపాలిటీ నుంచి డీ నోటిఫై చేయాలన్న డిమాండ్‌తో అధికార టీడీపీకి చెందిన 23వ వార్డు కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ మంగళవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం కౌన్సిల్ ‘కూటమి’ చేతిలో ఉన్న సమయంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో టీడీపీ కౌన్సిలర్ దీక్షకు దిగడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన నాయకులే.. జీవో అమలు చేయాలని దీక్షకు దిగడం గమనార్హం. మున్సిపాలిటీలో కూటమి నాయకులతో తీర్మానం చేయించడం కోసం ఇలా నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సి రావడమేమిటని చర్చ సాగుతోంది.